డిసెంబర్10న ఓయూకు వస్త.. వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్10న ఓయూకు వస్త.. వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి
  • చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే కొత్తవి నిర్మించాలి 
  • ప్రొఫెసర్లు, స్టూడెంట్ల అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి 
  • ఈ నెలాఖరుకల్లా మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి 
  • సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:
డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అకడమిక్ బ్లాకులు, హాస్టళ్లను పరిశీలిస్తాననని చెప్పారు. వర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. నిధుల గురించి ఆలోచించవద్దని, ఓయూను దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. 

శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో ఓయూ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూలో చేపట్టాల్సిన పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటిని పరిశీలించిన సీఎం.. హాస్పిటల్ భవనాలు, రోడ్లు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పుచేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీలో  చేపడుతున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 

‘‘అభివృద్ధి పనులకు సంబంధించిన నమూనాలను ప్రొఫెసర్లు, విద్యార్థుల ముందు పెట్టండి. వాళ్ల అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్సులు, ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్​ ఏర్పాటు చేయండి. వాళ్ల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరులోగా అభివృద్ధి ప్రణాళికను తయారు చేయండి” అని ఆదేశించారు.  

భవిష్యత్తులోనూ ఇబ్బందులు ఉండొద్దు.. 

వర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తం వెచ్చించి మరమ్మతులు చేసే బదులు కొత్త బిల్డింగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘‘సైకిల్, వాకింగ్ ట్రాక్స్, ఇతర సౌలతుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వర్సిటీలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే కొత్త వాటి ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో వంద మంది విద్యార్థులు ఉంటే, 110 మందికి సౌలతులు ఉండేలా నిర్మాణాలు చేపట్టాలి. భవిష్యత్తులోనూ విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బందులు ఉండొద్దు. ఓయూ విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలి. ఓయూ విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేయాలి. వర్సిటీ ప్రొఫెసర్లను విదేశాలకు పంపి, ట్రైనింగ్ ఇప్పించాలి” అని సూచించారు. 

విద్యాశాఖ అధికారులు ఓయూలో పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొన్నారు.