
- బెండాల పాడులో ఇందిరమ్మ ఇండ్ల మహోత్సవం
- పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
- సీఎం సభ సక్సెస్...కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో జోష్
- ప్రశాంతంగా సీఎం పర్యటన.. ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు
- చక్రబంధంలో చంద్రుగొండతో పాటు బెండాల పాడు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల మహోత్సవంతో పేదోళ్ల సొంతింటి కల సాకారమైంది. చంద్రుగొండ మండలంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు బుధవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని చంద్రుగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో జోష్ నిండింది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం మీటింగ్ భారీ సక్సెస్ కావడం తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని పలువురు నేతలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఎం పర్యటన ప్రశాంతంగా సాగడంతో జిల్లా ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. సీఎంతో పాటు మంత్రులకు ఆదివాసీ సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.
పేదల కళ్లలో ఆనందం..
దశాబ్దాల కాలంగా ఇండ్లు లేని ఆ పేదల కళ్లలో ఆనందం కనిపించింది. చంద్రుగొండ మండలం బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీహరి గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. సన్నబియ్యం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని గ్రామ దేవతలకు పూజలు చేశారు. గ్రామస్తులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు.
సీఎంతో పాటు మంత్రులు తమ ఇండ్లకు వచ్చి గృహప్రవేశాలు చేయిండంతో ఆ గ్రామంలోని పలువురు లబ్ధిదారులు ఆనందంతో ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన బచ్చల రమణ, బచ్చల సావిత్రి ఇండ్లలో సీఎంతో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. అక్కడే అల్పాహారం తిన్నారు. ఆయా కుటుంబాలతో కొంత సేపు గడిపారు. వారికి దుస్తులు అందించారు. సీఎంకు సభా వేదికపై పలువురు లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్ల నమూనాను బహుకరించి సత్కరించారు.
నేతలు, కార్యకర్తల్లో జోష్..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది బూస్ట్‌లా ఉపయోగపడుతోందని పలువురు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి ప్రజలతో పాటు కార్యకర్తలు సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు..
సీఎం ప్రోగ్రాంలో ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం పర్యటించిన చంద్రుగొండతో పాటు బెండాలపాడు, దామర చర్ల గ్రామాలను పోలీస్‌లు తమ ఆధీనంలోకి తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.