రాష్ట్రాభివృద్దికి సహకరించాలి: ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి

రాష్ట్రాభివృద్దికి సహకరించాలి: ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శనివారం (మే24) ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానిమోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్దికి సంబంధించిన అంశాలు, పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని  ప్రధానిని కోరారు. 

హైదరాబాద్లోని మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. గతంలో నిర్మించిన 69 కి.మీ ఫేజ్-I తరువాత 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు. రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం. ఇటీవలి కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు. 

మరోవైపు హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ది, భూసేకరణకు వ్యయంలో 50 శాతం భారాన్ని రాష్ట్రప్రభుత్వం భరించేందుకు సిద్దం ఉందని ప్రధానికి తెలిపారు. RRR  పనులను ఉత్తర, దక్షిణ భాగం లో రెండూ ఒకేసారి ప్రారంభించాలని కోరారు. అలా చేస్తే వ్యయం తగ్గుతుందని వివరించారు. RRRకు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే (Regional Ring Railway) లైన్ కు కేంద్రం సహకరించాలని సీఎం ప్రధానికి విజ్ణప్తి చేశారు. 

తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఇది ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

తెలంగాణలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ఏర్పాటుకు ఆమోదం తెలపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో R&D కేంద్రాలు, మౌలిక వసతులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.

హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడాన్ అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రక్షణరంగంలో మొదటినుంచి హైదరాబాద్ కీలకంగా ఉంది. ఈ రంగంలో MSME లను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణకు సహకారం అందించాలని కోరారు.