
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ డిమాండ్ తోనే దేశ వ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఒప్పుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ ప్రజల అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ ఒక్కరే గుర్తించారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో ప్రజల అభిప్రాయం మేరకే రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ చేశారన్నారు. కులగణనకు అంగీకరించిన ప్రధానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. కులగణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్ంకి దయాకర్ రావు అన్నారు.
బుధవారం ( ఏప్రిల్ 30 ) జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనాభా లెక్కలు జరగబోతున్నాయని అందులోనే కుల గణన కూడా చేయనున్నట్లు కేంద్రమంత్రిఅశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ (CCPA)లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
భారతదేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు తీశారు. ఆ తర్వాత పదేళ్లకు అంటే.. 2021లో మళ్లీ జన గణన జరగాల్సి ఉంది. ఆ సమయంలో కరోనా రావటంతో వాయిదా వేశారు. 2025లో జనాభా లెక్కలు లెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలోనే జనాభా లెక్కల్లోనే కుల గణన చేపట్టాలని.. ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారో తీసుకోవాలంటూ.. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ డిమాండ్ కు అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కుల గణన చేపట్టారు. ఈ రిపోర్ట్ ఆమోదించాలని కేంద్రానికి పంపించారు. దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు.. కుల గణన చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ కు.. ఇప్పుడు కేంద్రం ఓకే చెప్పింది. జన గణన ఎప్పుడు చేపడితే అప్పుడు.. అదే డేటాలో.. కుల గణన కూడా ఉంటుందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.