
కరకగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం కస్తూర్భా గాంధీ పాఠశాలను కలెక్టర్ జితేశ్వి.పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా తరగతులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి టీచింగ్విధానం, వారి విద్యాభ్యాసాలపై ఆరా తీశారు. స్కూల్ పరిసరాల్లోని వసతి గదులు, భోజనాల గది, ఫర్నిచర్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతుల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవిని ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నవోదయ స్కూల్ పనులను కలెక్టర్ పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో జి.మంజుల, తహసీల్దార్ గంట ప్రతాప్, డీటీ వట్టం కాంతారావు, ఆర్ఐ పి. కృష్ణ ప్రసాద్, ఏఈ శ్రీనివాస్, ఎంపీవో మారుతి యాదవ్, సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు.