మెదక్, నర్సాపూర్​లో ఎమ్మెల్యేలు, ఆశావహుల పోటాపోటీ

మెదక్, నర్సాపూర్​లో ఎమ్మెల్యేలు, ఆశావహుల పోటాపోటీ

మెదక్ :  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా రోజుల టైం ఉన్నప్పటికీ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ముఖ్య లీడర్లు పర్యటనలు ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు, వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాలలో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా తప్పకుండా హాజరవుతున్నారు. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. వారి పోటా పోటీ పర్యటనలపై  రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన  చర్చ నడుస్తోంది. 

మెదక్​లో పద్మా–శేరి.. నర్సాపూర్​లో మదన్​​రెడ్డి–సునీతారెడ్డి
మెదక్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువ రోజులు నియోజకవర్గంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా మండలాల్లో, మున్సిపాలిటీ పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు, ప్రైవేట్ షాప్స్, హోట్సల్ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నా, ప్రైవేట్​ కార్యక్రమాలకు మాత్రం ఒకరి తర్వాత మరొకరు వస్తుండటం గమనార్హం. ఇటీవల​ నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి, బడి బాట కార్యక్రమంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో పాల్గొన్నారు. ఇక పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు, డిన్నర్లు, పుట్టిన రోజు వేడుకలకు విధిగా హాజరవుతున్నారు. గతనెలలో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగైదు పెళ్లిళ్లు ఉన్నా అన్నింటికీ అటెండ్ అయ్యారు. నియోజవకర్గ పరిధిలో ఎక్కడ ఆలయ వార్షికోత్సవం, విగ్రహ ప్రతిష్ట, హోమాలు, కుల సంఘాల బోనాల పండుగ ఉన్నా పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రముఖుల ఇళ్లలో ఎవరైనా చనిపోతే పరామర్శలకు వస్తున్నారు. నర్సాపూర్​లో సునీతారెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించగా, దానికి పోటీగా అన్నట్టు ఆ తర్వాత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గీయులు నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పబ్లిసిటీకి అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వారు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడమే ఆలస్యం.. వారి పీఏలు, పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయా కార్యక్రమాల ఫొటోలు, వివరాలు వాట్సప్ ,ఫేస్ బుక్​ల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా మెదక్​లో వీళ్లిద్దరూ.. నర్సాపూర్​లో వాళ్లిద్దరూ ఎవరికివారు తమ పట్టు నిరూపించుకునే  ప్రయత్నం చేస్తున్నారు.