ఏం సాధించారని విజయోత్సవాలు?... అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది

ఏం సాధించారని విజయోత్సవాలు?... అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది
  • మంత్రుల మధ్య పంచాదుల కోసమే కేబినెట్ భేటీలు
  • ఒకరంటే ఒకరికి పడ్తలేదు: హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని 
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని విజయోత్సవాలు జరుపుతారో అర్థం కావడం లేదు. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి మాదిరి రాష్ట్రాన్ని అప్పగిస్తే.. మొత్తం నాశనం చేశారు’’అని దుయ్యబట్టారు. 

మంత్రుల మధ్య ఉన్న పంచాదుల గురించి మాట్లాడుకునేందుకే కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులంతా అర డజన్ వర్గాలుగా చీలిపోయారని ఆరోపించారు. ఒకరంటే ఒకరికి పడ్తలేదని తెలిపారు. 


తెలంగాణ భవన్​లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​తో కలిసి శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. “కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, కబ్జాల కోసం, పోస్టింగుల కోసం కొందరు.. ఇది మంత్రుల కేబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే అధ్వాన్నం. ప్రతి దాంట్లో కొట్లాటలే. ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు, ఈ మంత్రి ఆ మంత్రిని తిట్టుడు, ఇదే సరిపోయింది. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయంగా మంత్రులే భయపడుతున్నరు” అని హరీశ్ అన్నారు.

అందినకాడికి దోచుకుంటున్నరు

దీపం ఉండంగనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ‘‘కాంట్రాక్టుల కోసం డిపార్ట్​మెంట్లే రద్దు చేస్తున్నరు. పారిశ్రామికవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినీ హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. 

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తెచ్చిండు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నడు. ఇంత జరుగుతున్నా.. బీజేపీ ఎందుకు సైలెంట్​గా ఉందో అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ స్పందించాలి’’అని హరీశ్ డిమాండ్ చేశారు. 

హ్యామ్ రోడ్ల పేరిట పేదల రక్తం పీల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపించారు. ‘‘హ్యామ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు ట్యాక్స్​లు పెంచిన్రు. హ్యామ్​ మోడల్.. ఓ బోగస్.  దాని పేరు చెప్పుకుని కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదు’’అని హరీశ్ రావు అన్నారు.