విజయం దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కసరత్తులు

విజయం దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కసరత్తులు

కర్నాటకలో విజయానికి అత్యంత చేరులో ఉన్న కాంగ్రెస్.. ఆధిక్యంలో కొనసాగుతూ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం 119 స్థానాల్లో విజయం దిశగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ ఎమ్మెల్యేలను తమిళనాడుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోందని, అధికార డీఎంకే నాయకత్వంతో టచ్‌లో ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సాయంత్రంలోగా బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ లీడ్ లోకి వెళ్లడంతో.. ఆ క్రెడిట్ అంతా రాహుల్ గాంధీ అప్పట్లో చేపట్టిన భారత్ జోడో యాత్రదే అని చాటిచెప్పేలా కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నప్పటి ఓ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్.. విజయంపై చాలా నమ్మకంగా ఉన్నామని తననెవరూ ఆపలేరంటూ ఓ క్యాప్షన్ ను జోడించింది. రాహుల్ గాంధీ యాత్ర ప్రజలను "శక్తివంతం" చేసి అధికారంలో ఉన్న బీజేపీని దెబ్బతీసిందని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పిలుపునిచ్చారు.

ఇక ఆధిక్యతలు రావడంతో కాంగ్రెస్‌లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గెలిస్తే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవిపై పోరు జరగడమే ప్రధాన సవాలుగా మారనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. 'బీజేపీని అధికారం నుంచి తప్పించేందుకు ఏమైనా చేస్తాం.. కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా మా నాన్న ముఖ్యమంత్రి కావాలి' అంటూ ఆయన ఆకాంక్షించారు.

38 ఏళ్ల ప్రభుత్వాల ప్రత్యామ్నాయ విధానాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పోరాడిన బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ సారి తీవ్రంగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు రోడ్‌షోలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. 1985 నుంచి ఐదేళ్ల పూర్తి పదవీకాలం తర్వాత కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదు.