సిటీలో ఫ్లెక్సీలు, కటౌట్లపై రగడ

సిటీలో ఫ్లెక్సీలు, కటౌట్లపై రగడ
  • సిటీలో ఫెక్సీలు, కటౌట్లు నిషేధం ఉత్తిదేనా ? కేటీఆర్ సమాధానం చెప్పాలి
  • గులాబీ ఫ్లెక్సీలతో నగరాన్ని నింపటాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా సిటీలో ఎక్కడపడితే అక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడంపై రగడ మొదలైంది. గత జనవరి నుంచి సిటీలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది. సిటీని గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపటాన్ని వ్యతిరేకిస్తూ మరికాసేపట్లో బుద్ధ భవన్ లోని జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( GHMC Disaster Response Force-DRF),  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫిస్ వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చింది. 

నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని వ్యతిరేకిస్తోన్న బీజేపీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయని కేటీఆర్ గత వ్యాఖ్యలను కమలనాథులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవటానికే ఫ్లెక్సీలను కేటీఆర్ ఏర్పాటు చేయించుకున్నాడా? అని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. నిషేధం టీఆర్ఎస్ పార్టీకి కాదు ఇతర పార్టీలకు కోసమే నిబంధనలా?  సిటీలోని ప్రముఖుల  విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ తోరణాలను కట్టడం పై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. బుద్ధ భవన్ వద్ద  చేపట్టనున్న ధర్నాలో బీజేపీ కార్పోరేటర్లు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.