ఏపీ హైకోర్టు వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

ఏపీ హైకోర్టు వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

అమరావతి: హైకోర్టు వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న దంపతులను స్పెషల్ పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దంపతులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన దంపతులు దేవేంద్రరావు, భానుశ్రీలుగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న కారణాలపై ఆరా తీయగా స్థల వివాదంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. 
దేవేంద్రరావు దంపతులు ధూళిపాళ్ల గ్రామంలో 2003 నుంచి నివాసం ఉంటున్న స్థలాన్ని బస్ షెల్టర్ నిర్మాణం కోసం తీసుకునే ప్రయత్నం చేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు దంపతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చినా గ్రామంలోని కొంత మంది నాయకులు తమను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని కంటతడిపెట్టుకుంటూ చెప్పారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా గ్రామంలోని కొందరు నాయకులు తమను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండడంతో విసిగిపోయామని, ఏం చేయాలో తెలియక హైకోర్టు ఎదుటే ఆత్మహత్య చేసుకుందామని భావించామని వివరించారు. ఈ దంపతులను స్పెషల్ పోలీసులు తుళ్లూరు పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసుకున్నారు.