చేతి వృత్తులకు ఏటా కేంద్రం నుంచి రూ.730 కోట్లు

చేతి వృత్తులకు ఏటా కేంద్రం నుంచి రూ.730 కోట్లు
  • కేంద్ర మైనారిటీ శాఖ ద్వారా ఇస్తున్నమన్న కిషన్​రెడ్డి

ముషీరాబాద్​, వెలుగు: చేతి వృత్తుల కళల రక్షణ, కళాకారుల ప్రోత్సాహం కోసం కేంద్ర మైనారిటీ శాఖ ఏటా రూ.730 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. చేతి వృత్తుల పరిరక్షణకు ‘హునార్​ హాత్​’ ఎంతో తోడ్పడుతోందన్నారు. దీని ద్వారా కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా ఆదివారం హైదరాబాద్​ ఎన్టీఆర్​ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో 37వ హునార్​ హాత్​ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు. కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్​ అలీ, ఎంపీ సురేశ్​రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్​, ఎమ్మెల్యే రఘునందర్​రావుతో కలిసి ఆయన దానిని ప్రారంభించారు. కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన హునార్​ హాత్​ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోందని కిషన్​ రెడ్డి అన్నారు. ఎగ్జిబిషన్​ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. తెలంగాణలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హునార్ ​హాత్​లో 700 మందికిపైగా కళాకారులు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్​ను ప్రదర్శనకు పెట్టారని చెప్పారు.  

బ్యాంకు రుణాలిచ్చేందుకు సిద్ధం: నఖ్వీ

చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించడం కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, వారికి బ్యాంకు రుణాలిచ్చేందుకూ కేంద్ర మైనారిటీ శాఖ సిద్ధంగా ఉందని అబ్బాస్​ నఖ్వీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా హునార్​హాత్​లో ప్రజలు తమకు ఇష్టమైన కళారూపాలను కొనుగోలు చేయవచ్చని, దాని వల్ల కళాకారులకు లాభం కలగుతుందని పేర్కొన్నారు. దేశమంతటా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా వారి ఆదాయం మెరుగవుతుందన్నారు. ఏడేండ్లలో సుమారు 8 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పించిందని చెప్పారు.