మంత్రులు చూసిపోయిన్రు..   పరిహారం ఇస్తలేరు

మంత్రులు చూసిపోయిన్రు..   పరిహారం ఇస్తలేరు

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: వానలకు దెబ్బతిన్న పంటలను చూసి రమ్మని సీఎం కేసీఆర్​చెప్పారు. మీకు ధైర్యం చెప్పేందుకే మేమిక్కడికి వచ్చాం. తెలంగాణ రైతుల రాష్ట్రం. ఎవరూ అధైర్య పడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది.– గత నెల 18న ఉమ్మడి వరంగల్​లో పంటల పరిశీలన సందర్భంగా మంత్రులు నిరంజన్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పిన మాటలివి. వడగండ్ల వానకు ఉమ్మడి వరంగల్​లో దెబ్బతిన్న పంటలను మంత్రులు పరిశీలించి రెండు వారాలు దాటుతున్నా నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. జనవరి రెండో వారంలో కురిసిన రాళ్ల వానకు వరంగల్‍ జిల్లా రైతులు కుదేలయ్యారు. మిర్చి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు.. ఇలా ప్రతీ పంట నేలమట్టమైంది. ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలో 56 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. వరంగల్‍, హనుమకొండ, భూపాలపల్లి జయశంకర్‍ జిల్లాల పరిధిలోనే 34,331 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 402 గ్రామాల్లోని 26,388 మంది బాధిత రైతులున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు ఇలా జరగడంతో కుటుంబం, ఇంటికొచ్చే చుట్టాలతో సంతోషంగా ఉండాల్సిన వేలాది మంది రైతులు నీట మునిగిన పంటను చూస్తూ కన్నీరు కార్చారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఇతర లీడర్లు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న  రైతుల పంటలను పరిశీలించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‍ ఆదేశానుసారం మంత్రులు నిరంజన్‍రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్‍, మాలోత్ కవిత, జడ్పీ చైర్​పర్సన్​గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి బృందం వరంగల్​లో పర్యటించింది. ఈ సందర్భంగా  మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా రైతులు ఎక్కడికక్కడ తమను ఆదుకోవాలంటూ మంత్రుల కాళ్ల మీద పడ్డారు. పరకాల మండలం నాగారానికి చెందిన మహిళా రైతులు నేలరాలిన మిర్చి పంటను దోసిళ్లలో పట్టుకుని మంత్రులకు చూపారు. మీ కాల్మొక్తం అంటూ కాళ్ల మీద పడ్డారు. మమ్మల్ని ఆదుకోవాలి సార్‍.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ బోరున ఏడ్చారు. నష్ట పరిహారం విషయంలో సీఎం కేసీఆర్‍ నిర్ణయం తీసుకుంటారన్న మంత్రుల హామీతో..  నాటి నుంచి వేలాది మంది రైతులు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లి మూడో వారం దగ్గరికొస్తున్నా .. కేసీఆర్‍ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ క్రమంలో వేలాది మంది రైతులు పరిహారం ఇస్తారో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు.