- సీఎస్‌బీకి ఫిర్యాదు చేసిన డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సురేశ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పరిశ్రమల శాఖ టీజీ -ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. ఈ దాడిలో పోర్టల్‌కు సంబంధించిన డేటాబేస్‌తో పాటు ఇతర ఫైళ్లు ఎన్‌క్రిప్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంగా సురేశ్ శనివారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్బీ)లో ఫిర్యాదు చేశారు. జీ 2 బీ సేవలను అందించే రాష్ట్ర సింగిల్ విండో పోర్టల్ ప్రాముఖ్యత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ సురేశ్ అందించిన వివరాల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం..దాడితో టీజీ ఐపాస్ అప్లికేషన్ పోర్టల్ నిలిపివేత
తెలంగాణలో పరిశ్రమలకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు,సేవల కోసం ఉపయోగించే కీలకమైన సింగిల్ విండో పోర్టల్ టీజీ- ఐపాస్ అప్లికేషన్ అక్టోబర్ 22న రాత్రి 11.36 గంటల నుంచి పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ టెక్నికల్ టీమ్‌కు డేటాబేస్ సర్వర్ కనెక్ట్ కాలేకపోయింది. దీంతో క్లౌడ్ సేవలందించే సంస్థ క్లౌడ్ 4 సీ ను సంప్రదించి సర్వర్‌ను పునఃప్రారంభించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే తదుపరి పరిశీలనలో తమ సర్వీస్ ఏజెన్సీ ఎస్‌క్యూఎల్ సర్వర్ కూడా నిలిచిపోయినట్లు గుర్తించారు. దీన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించినా టెక్నికల్ టీమ్‌కు సాధ్యం కాలేదు. కాగా, సర్వర్ హ్యాక్ కావడంతో పాటు టీజీ ఐపాస్ డేటాబేస్, సంబంధిత ఎన్‌క్రిప్ట్ ఫైల్స్. వీజీబీ అనే గుర్తుతెలియని ఎక్స్టెన్షన్ ఫైల్స్‌తో అటాచ్మెంట్ గుర్తించారు.
డేటా లీక్స్5 జీ మెయిల్ ఐడీతో ర్యాన్సమ్ వేర్ అటాక్
సర్వర్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా సర్వర్‌లో ఒక ర్యాన్సమ్ నోట్ కనిపించింది. అందులో డాటాలీక్స్5@ జీ మెయిల్. కమ్ అనే ఈ-మెయిల్ చిరునామాతో పాటు వీజీ2ఏబీఈ240ఈసీడీఈడీడీడీ5డీ6 అనే మెషీన్ ఐడీ ఆధారంగా ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు ఐటీ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఈ కారణంగా డేటా ఎన్‌క్రిప్ట్ అయినట్లు కనిపిస్తున్నప్పటికీ, పోర్టల్, డేటాబేస్ సేవలు అందుబాటులో లేవని గుర్తించారు.
సైబర్ దాడితో సర్వర్ హ్యాకింగ్‌కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌క్రిప్ట్ చేయబడిన ఫైళ్ల స్క్రీన్షాట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేశారు. డేటా పూర్తిగా తొలగిపోయిందా? ఎవరైనా అనధికారికంగా డేటాను తస్కరించారా? అనే అంశాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు క్లౌడ్4సీ, టీజీ ఐపాస్ టెక్నికల్ టీమ్‌తో కలిసి సీఎస్బీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
