- సైబర్ నేరాలూ పైపైకి.. జన్నారంలో బయటపడ్డ కాంబోడియా వ్యవహారం
- 16 మర్డర్లు, 61 కిడ్నాప్‌లు, 35 రేప్‌లు
- 275 చీటింగ్, 323 మిస్సింగ్కేసులు నమోదు
- యాక్సిడెంట్లలో 136 మృతి, 435 మందికి గాయాలు
- ఈ చలాన్ కేసుల్లో రూ.9.22 కోట్ల ఫైన్లు
మంచిర్యాల, వెలుగు: 2025 సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో సాధారణ నేరాలు తగ్గినప్పటికీ.. ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్స్పెరిగాయి. రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్కిశోర్ ఝా శనివారం వివరాలు వెల్లడించారు. వీటిలో ఆగస్టులో వెలుగుచూసిన చెన్నూర్ఎస్బీఐ గోల్డ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. క్యాషియర్రవీందర్360 మంది కస్టమర్లు బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన 20.154 కిలోల బంగారాన్ని దొంగిలించాడు. 42 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాల ద్వారా మరో 4.2 కిలోల బంగారం చూపించి రూ.1.75 కోట్ల లోన్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ రూమ్, ఏటీఎం నుంచి రూ.1.10 కోట్ల నగదు అపహరించాడు. ఈ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి సుమారు రూ.10 కోట్ల లోన్లు తీసుకున్నాడు. ఈ కేసులో మొత్తం 47 మంది నిందితులను గుర్తించి 13 మందిని అరెస్ట్ చేసి, 34 మందికి నోటీసులు జారీ చేశారు.
జన్నారం కేంద్రంగా సైబర్ నేరాలు
జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో కాంబోడియా కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ క్రైమ్‌ను పోలీసులు బయటపెట్టారు. సిమ్ బాక్స్ ద్వారా సైబర్ మోసాలు, అక్రమ టెలీ మార్కెటింగ్, స్పామింగ్ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. ఈ ఏడాది జులై 7న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 262 సిమ్ కార్డులు, రూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులను అరెస్ట్‌చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లాలో 120 సైబర్ క్రైమ్కేసులు నమోదు కాగా, 17 మందిని అరెస్ట్ చేశారు. రూ.1.68 కోట్లు నిందితులు దోచుకోగా.. 67 కేసుల్లో రూ.46.41 లక్షలు రికవరీ చేశారు. 429 యాక్సిడెంట్లలో 136 మంది మృతి : ఈ ఏడాది 429 యాక్సిడెంట్లలో 136 చనిపోగా, 435 మందికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ‘అరైవ్.. అలైవ్’ ప్రోగ్రాం ద్వారా ఆర్అండ్బీ, ఎక్సైజ్, ఆర్టీవో, హైవే ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విలేజ్ రోడ్‌సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 39 బ్లాక్ స్పాట్స్ వద్ద యాక్సిడెంట్లను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు.
రూ.9.22 కోట్ల ఫైన్లు: ఈ ఏడాది జిల్లాలో 3.38 లక్షల ఈ- చలాన్ కేసులు నమోదయ్యాయి. రూ.9.22 కోట్ల ఫైన్లు విధించారు. అలాగే 7,852 డ్రంక్ అండ్ డ్రైవ్కేసులు నమోదు చేసి 4,353 మందికి రూ.75.76 లక్షల జరిమానా విధించారు. నలుగురికి జైలుశిక్ష విధించారు.
323 మంది మిస్సింగ్: ఏడాది మంచిర్యాల జిల్లాలో 333 -మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక బాలుడు, వంద మంది -పురుషులు, 232-మహిళలు ఉన్నారు. బాలుడితో పాటు 92- పురుషులు, 223- మహిళల ఆచూకీ కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు.
63 మందిపై హిస్టరీ షీట్స్: తరచూ అసాంఘిక
కార్యకలాపాలకు పాల్పడుతున్న 63 మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇందులో 20 మందిపై రౌడీ షీట్స్, 43 మందిపై సస్పెక్ట్ షీట్స్ తెరిచారు.13 మందిపై గ్యాంగ్ఫైల్స్ఓపెన్ చేశారు. లోక్ అదాలత్‌ల ద్వారా 15,734 కేసులు పరిష్కరించారు. ఈ ఏడాది పెండింగ్‌లో ఉన్న 336 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు: జిల్లాలో 108 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్రిజిస్టర్ చేసిన వెంటనే బాధితులకు రూ.22.80 లక్షల నష్టపరిహారం కోసం రిపోర్ట్ చేయగా, 47 కేసుల్లో ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. 62 కేసుల్లో చార్జిషీట్ వేసిన తర్వాత రూ.18 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం రిపోర్ట్ చేశారు. మరో 20 కేసుల్లో జడ్జిమెంట్తర్వాత అందించే నష్టపరిహారం కోసం ప్రతిపాదన పంపారు.
196 మంది చిన్నారులకు విముక్తి: ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 196 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వారిని స్కూళ్లలో చేర్పించారు. అందులో 139- బాలురు, 57-బాలికలు ఉన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై 13 -కేసులు నమోదు చేసి 16 -మందిని అరెస్ట్ చేశారు.
ఈవ్టీజర్ల పనిపట్టిన షీ టీమ్స్: షీ టీమ్స్ ద్వారా 1,303 హాట్స్పాట్లలో నిఘా ఉంచారు. అలాగే మహిళల భద్రత, నేరాలపై 300 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 362 మంది ఈవ్ టీజర్స్‌ను స్కూళ్లు, కాలేజీలు, పరీక్షా కేంద్రాల, బస్ స్టాండ్లు వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 41 మంది మైనర్స్, 284 మంది మేజర్లకు తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. 37 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. షీ టీమ్స్‌కు 128 ఫిర్యాదులు రాగా, వివిధ పోలీస్స్టేషన్లలో 42 ఎఫ్ఐఆర్లు, 12 ఈ పెట్టీ కేసులు ఫైల్ చేశారు.
మహిళలపై వేధింపులు : 29 పోక్సో కేసులతో కలిపి మొత్తం 35 రేప్ కేసులు నమోదయ్యాయి. వేధింపుల కేసులు 325, వరకట్నం మరణాలు మూడు నమోదయ్యాయి.
2700 ఫోన్ల రికవరీ: కమిషనరేట్ పరిధిలో 8,171 సెల్ఫోన్లు పోవడంతో పాటు చోరీ అయ్యాయి. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 2700 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు.
ముఖ్యమైన కేసుల వివరాలు
నేరం 2024 2025
గ్రేవ్ కేసులు 122 92
చీటింగ్ 372 275
పెట్టీ కేసులు 10,132 10,962
మర్డర్లు 23 16
హోమిసైడ్ 08 08
కిడ్నాప్ 55 61
రేప్ 41 35
అటెంప్ట్మర్డర్ 40 30
మిస్సింగ్ 273 323
క్రైమ్ కేసులు 4,457 5,289
