
సాహసోపేత విన్యాసాలకు ప్రసిద్ధి గాంచిన రెమి లూసిడి సాహస విన్యాసం చేస్తూనే చనిపోయాడు. హాంకాంగ్ లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ పైకి ఎక్కుతుండగా అకస్మాత్తుగా 68 అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అందరూ రెమి ఎనిగ్మాగా అని పిలుచుకునే లూసిడి.. జూలై 27న రాత్రి 7.30గంటల ప్రాంతంలో ట్రెగుంటర్ టవర్ లోని 40వ అంతస్తులో ఉంటున్న తన తన ఫ్రెండ్ ను వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. ఈ క్రమంలో అతను 68వ అంతస్తు నుంచి పడిపోతున్న సమయంలో పెంట్ హౌస్ కిటికీలను పట్టుకునే ప్రయత్నం చేశాడని ఓ ఇంట్లో పనిచేసే పనిమనిషి చెప్పింది. అలా కిటికీ తలుపులను అతను పట్టుకోగలిగితే ప్రాణాలతో ఉండే వాడని అక్కడి వారు చెబుతున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లోనూ ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ రికార్డయ్యాయి. ఇందులో లూసిడి 49వ అంతస్తులో ఉన్న ఎలివేటర్ నుంచి బయటికొచ్చి 68వ అంతస్తు వైపుకు వెళ్లే మొట్లను ఎక్కుతున్నట్టు ఈ వీడియోలో రికార్డయింది.
ఆరు రోజుల క్రితమే లూసిడి హాంకాంగ్ స్కైలైన్ ఎక్కినటువంటి ఫొటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అతనిది అదే చివరి ఫొటో అయింది. లూసిడి మరణంపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.