- అగ్రనేతల ఓపెన్ టాప్ బస్సు యాత్ర
- వేలాది మంది పోలీసులతో భద్రత
- సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా
- వ్యాపారుల వద్దే షాపింగ్ చేయండి..
- ర్యాలీకి వచ్చిన వారికి రాహుల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఆదివారం అంచనాలకు మించి జనసంద్రంగా మారింది. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ నిరసన ప్రదర్శన కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోయాయి. చారిత్రక రామ్ లీలా మైదానం జనసందోహంతో నిండిపోయింది. శనివారం నుంచే వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లు, కార్లు, విమానం, బస్సుల్లో తరలిన పార్టీ కేడర్, మద్దతుదారులు ఆదివారం ఉదయానికల్లా పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు.
మధ్యాహ్న సమయానికి రామ్ లీలా మైదానం కిటకిటలాడింది. ఇండియా కూటమి ఈ ర్యాలీకి లక్షలాదిగా జనం తరలివస్తారని అంచనా వేయగా, ఢిల్లీ పోలీసులు సైతం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మైదానం నిండిపోవడంతో బయటి ప్రాంతాల్లో కూడా జనం భారీగా బారులు తీరారు. సీనియర్ నేతల కోసం ప్రధాన వేదికపై పెద్ద త్రివర్ణ పతాక కేనోపీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి రాష్ట్ర యూనిట్ల ప్రతినిధుల కోసం మరో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. భద్రత, రద్దీ నియంత్రణ కోసం తెల్లటి కేనోపీ టెంట్లు, మెటల్ బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు.
మింటో రోడ్ నుంచి ర్యాలీ
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజా, దీపాంకర్ భట్టాచార్య తదితర ప్రముఖ నాయకులు సమావేశమయ్యారు. అక్కడి నుంచి అందరూ కలిసి ఓపెన్ బస్సులో మింటో రోడ్డుకు చేరుకుని, అక్కడి నుంచి రామ్ లీలా మైదానం వరకు సాగిన భారీ మార్చ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వ్యాపారుల కోసం రాహుల్ ప్రత్యేక విజ్ఞప్తి
పండుగ రద్దీ ఉండే దీపావళి, ఛత్, భాయ్ దూజ్ సీజన్‌కు ముందు ఇలాంటి భారీ నిరసనలు జరగడం వల్ల ఢిల్లీ వ్యాపారులకు నష్టమంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. అదంతా బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారమని, తమ నిరసనల వల్ల వ్యాపారాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కూటమి ర్యాలీకి హాజరైన వారికి ఆయన ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నిరసనలో పాల్గొన్న వారు స్థానిక వ్యాపారుల వద్దే షాపింగ్ చేయాలని, చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.
