మెజార్టీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్ భవన్ లో కాదు : కమలహాసన్

మెజార్టీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్ భవన్ లో కాదు : కమలహాసన్

తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో అధికార పీఠంపై అనిశ్చితి కొనసాగుతోంది. 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే పార్టీ అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారా?

తమిళనాడు గవర్నర్ వైఖరిని కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కమల్ మండిపడ్డారు.

స్టాలిన్ పై ప్రశంసలు.. విజయ్‌కు మద్దతు..

ఈ రాజకీయ చదరంగంలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని కమల్ ప్రశంసించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని ప్రకటించిన నా సోదరుడు స్టాలిన్ రాజకీయ పరిణతికి నా సెల్యూట్ అని పేర్కొన్నారు. అయితే, అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ను పిలవకుండా కాలయాపన చేయడం వల్ల ఎన్నికైన 233 మంది ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారని, ఇది రాష్ట్రానికే అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు.

గవర్నర్‌కు హెచ్చరిక?
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని, ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు.. ఒక రిమైండర్ అని కమల్ హెచ్చరించారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకేకు అవకాశం ఇవ్వకపోవడం అంటే ఓటర్ల తీర్పును కాలరాయడమేనని విమర్శించారు. ఇప్పటికైనా విజయ్ ను పిలవాలని కమల్ డిమాండ్ చేశారు.

 

 కీలక మలుపు

సినిమాలను వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అన్నాడీఎంకే, ఇటు డీఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య 108 సీట్లు సాధించి సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు తమిళ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. మ్యాజిక్ ఫిగర్ తో ప్రభుత్వం ఏర్పాటుకు మిత్ర పక్షాల నుంచి మద్దతు కూడగట్టే పనిలో విజయ్ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడు ప్రజలందరి కళ్లు రాజ్‌భవన్‌పైనే ఉన్నాయి. మరి గవర్నర్ అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్‌ను ఆహ్వానిస్తారా? లేక రాజకీయ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.