
- కార్యాచరణ రిపోర్టుపై ఆఫీసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
- ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్విప్మెంట్ స్టోర్ ఏర్పాటు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో విద్యుత్ సామగ్రి అందుబాటులో ఉండేలా ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థల సీఎండీలను ఆయన ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ సంస్థల ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ రిపోర్టును భట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.
2030 నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసిందని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు. ఈ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు సింగరేణి, ఎన్టీపీసీ, జెన్ కో వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీసుకుంటున్న చర్యలపై ఆయన నివేదించారు. ప్రస్తుత కెపాసిటీ 20,883 మెగావాట్లు, కాంట్రాక్టెడ్ కెపాసిటీతో కలిపి 26,183 మెగావాట్లు అని ఆయన వెల్లడించారు.
ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ 2024తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 9.8 శాతం పెరిగి 17,162 మెగావాట్లకు చేరిందన్నారు. 2030 నాటికి ఈహెచ్‌టీ సబ్స్టేషన్లను 389 నుంచి 511కి, 33/11 కేవీ సబ్స్టేషన్లను 4,031కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 9,862 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ఈ ఏడాది 11,017 మెగావాట్లకు పెరిగిందని, 410 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని వివరించారు.
నార్తర్న్ డిస్కం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాలలో డిమాండ్ 24.64 శాతం పెరిగిందని, 342 సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ అనిల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 7,913 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ సామర్థ్యం ఉందని, 2030 నాటికి 19,874 మెగావాట్లకు చేరేలా చర్యలు చేపట్టామని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా డిస్ట్రిబ్యూటెడ్ రినువబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్, జియో థర్మల్, ఈవీ చార్జర్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలా కృషి చేస్తున్నామన్నారు. 23 గ్రామాలు, రెండు మండలాలను సోలరైజ్డ్ మోడల్‌గా రూపొందిస్తామని పేర్కొన్నారు.