
India-Pak War: పాకిస్తాన్ దేశంతో ఇండియా ఇప్పుడు యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.. అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని యుద్ధం అని భారత ప్రభుత్వం ప్రకటించిందా లేక పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి.. ఎవరు ప్రకటిస్తారనే ప్రశ్నలు ప్రతి భారతీ పౌరుడి మనస్సులో కొనసాగుతున్నాయి. గడచిన 3 రోజులుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నది యుద్ధం కాదా.. కేవలం దాడులు మాత్రమేనా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ ప్రత్యేక కథనం..
ఒకదేశం మరో దేశంతో యుద్ధానికి దిగాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అయితే భారతదేశం యుద్ధం విషయంలో ఎలాంటి ప్రక్రియను ఫాలో అవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో యుద్ధాన్ని ప్రకటించే పవర్స్ ప్రెసిడెంట్ వద్ద ఉంటాయి. అయితే ముందుగా కేంద్ర మంత్రులతో ప్రధాని కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. రాజ్యాంగంలో ప్రత్యేకంగా యుద్ధానికి సంబంధించి ప్రక్రియను పొందుపరచలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అనేది యుద్ధం లాంటి పరిస్థితికి సంబంధించినదిగా రాజ్యాంగంలో ఉంది.
* భారతదేశంలోని త్రివిధ దళాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్. అయితే యుద్ధానికి వెళ్లాలా లేక శాంతియుతంగా ముందుకు సాగాలా అనే నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయిస్తారు. ఆర్టికల్ 53 ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రపతి కలిగి ఉంటారని చెబుతోంది. అలాగే ఆర్టికల్ 74లో కేబినెట్ మంత్రులతో నిర్ణయానికి ముందు సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించబడింది.
* యుద్ధానికి వెళ్లాలా వద్దా అనే విషయంలో కేబినెట్ చాలా కీలకంగా వ్యవహరించనుంది. ప్రధాని నేతృత్వంలో రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మంత్రులకు కీలకమైన సూచనలు అందుతాయి. అయితే చివరికి నిర్ణయం తీసుకోవటానికి ముందు మిలిటరీ చీఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి కూడా సమాచారం సేకరించబడుతుంది. 44వ సవరణ చట్టం 1978 ప్రకారం, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అయితే ఇది కేబినెట్ నుండి వ్రాతపూర్వక సిఫార్సు ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది.
* పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా యుద్ధాన్ని ప్రకటించడానికి బాధ్యత వహించనప్పటికీ.. పర్యవేక్షణతో పాటు నిధులను సమకూర్చటం వంటి విషయాల్లో కీలక పాత్ర నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రక్షణ బడ్జెట్ పర్యవేక్షించటం, సైన్యం చేపడుతున్న చర్యలపై చర్చించటం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చటం వంటివి ఉంటాయి. అయితే దీర్ఘకాలం పాటు అనిశ్చుతులు కొనసాగిన సమయంలో ప్రభుత్వం పార్లమెంటుకు సమాచారం అందించి రాజకీయ ఏకాభిప్రాయాన్ని కోరుతుంది.
ఒకవేళ యుద్ధానికి వెళ్లే ప్రక్రియను గమనిస్తే.. కేంద్ర కేబినెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాత వ్రాతపూర్వకంగా యుద్ధానికి వెళ్లటం గురించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. అయితే ఇది పూర్తి దేశానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తించవచ్చు. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి లోక్ సభ, రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రత్యేకంగా ప్రక్రియ ఏమీ లేదు.
1971 సమయంలో యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యింది..?
డిసెంబర్ 3, 1971న భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులకు దిగింది. పాక్ చర్యల తర్వాత భారత్ అప్పట్లో ఇండో-పాక్ యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ చేసిన దాడులను భారతదేశంపై యుద్ధ ప్రకటనగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా భారత్ సైతం వైమానిక దాడులకు దిగింది. ఇందిరా గాంధీ ఈస్ట్ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు ఆదేశించింది.