
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)కు అప్పగించింది. ఈ మేరకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులుగా రాహుల్‌దేవ్ వర్మ, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరిని నియమించింది. నకిలీ మద్యం కేసును నిష్పాక్షతంగా విచారణ చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మద్యాన్ని ఎలా నకిలీ చేయాలో ఆఫ్రికాలో నేర్చుకొని ఏపీలో అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ముసుగులో కొందరు తప్పుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశామని.. మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించామని ఆయన చెప్పారు.
కాగా, ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు, ఆయన సోదరుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మద్యం కేసుపై డైలాగ్ వార్ నడుస్తోంది.