
అమరావతి: బాపట్ల జిల్లాలోని చీరాల బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో సరదాగా బీచ్‌కు వెళ్లిన ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల ప్రకారం.. అమరావతిలోని ఓ యూనివర్సిటికీ చెందిన కొందరు విద్యార్థులు ఆదివారం (అక్టోబర్ 12) హాలీ డే కావడంతో సరదాగా చీరాల బీచ్‌కు వెళ్లారు. ఫ్రెండ్స్ అంతా కలిసి సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన బీచ్ సిబ్బంది, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి డెడ్ బాడీలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతులను తెలంగాణకు చెందిన మంద సోమేష్, శ్రీ సాకేత్, మణిదీప్‌లుగా గుర్తించారు పోలీసులు. గల్లంతైన యువకులు వేటపాలెం వడ్డె సంఘానికి చెందిన షారోన్, గౌతమ్ గుర్తించారు. గల్లంతైన ఇద్దరి కోసం మత్స్యకారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. చదువుల కోసం వెళ్లిన చేతికొచ్చిన కొడుకులు చనిపోయారని పిడుగులాంటి వార్త తెలియడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విగతజీవులుగా పడి ఉన్న కొడుకుల మృతదేహాలపై పడి లే బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారందరి చేత కన్నీరు పెట్టించింది.