పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా : శ్రీకాళహస్తి వినూత కోట

పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా : శ్రీకాళహస్తి వినూత కోట

ఏపీలో రాజకీయ దుమారం రేపిన శ్రీకాళహస్తి కోటా వినూత డ్రైవర్ హత్య కేసు మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. హత్యకు గురైన డ్రైవర్ సెల్ఫీ వీడియో బయటపడటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో వినూత ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ హత్య కేసులో నిర్దోషులుగా బయటికి వస్తామని అన్నారు. లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలు వదులుకొని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు. హత్యలు చేసే మనస్తత్వం మాది కాదని.. ఈ కేసుతో తమకు సంబంధం లేదని కోర్టులో నిరూపించుకొని క్లీన్ చిట్ తో బయటికి వస్తామని అన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని అన్నారు వినూత.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని.. అందుకే ఇన్నాళ్లు మీడియా ముందుకు రాలేదని అన్నారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లినందుకు బాధ లేదని.. హత్య చేశామంటూ మీడియాలో ప్రచారం జరగడం ఎక్కువగా బాధించిందని అన్నారు. డ్రైవర్ చావులో మా ప్రమేయం  లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిల్ వచ్చిందని అన్నారు వినూత.

►ALSO READ | CRDA హెడ్ ఆఫీసు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. అమరావతి రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం..

ఈ కేసు చెన్నై కోర్టులో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడొద్దని లాయర్లు సూచించారని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. నిజానిజాలు దేవుడికి తెలుసని అన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని అన్నారు వినూత. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని.. ప్రతి ఒక్కరు న్యాయం వైపు గెలుస్తారని భావిస్తున్నానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు వినూత. ప్రస్తుతం వినూత సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.