ఐపీఎల్ 2025.. మా దేశంలో నిర్వహించండి.. ఇండియాను కోరిన ఇంగ్లండ్

ఐపీఎల్ 2025.. మా దేశంలో నిర్వహించండి.. ఇండియాను కోరిన ఇంగ్లండ్

క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ అర్థంతరంగా తాత్కాలికంగా వాయిదా పడటంతో నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. క్రికెట్ కంటే దేశమే ముఖ్యం అని బీసీసీఐ తాత్కాలికంగా వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఉద్రిక్తలు తగ్గుముఖం పడిన తర్వాత కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేయాలని బీసీసీఐ భావించింది. ఈ తరుణంలో ఐపీఎల్ ను తమ దేశంలో నిర్వహించాలని ఇంగ్లండ్ కోరింది. ఐపీఎల్ ను ఆపాల్సిన పని లేదని, ఇండియా-పాక్ ఉద్రిక్తల నడుమ ఇండియాలో నిర్వహించడం కంటే తమ దేశంలో కొనసాగించడం సురక్షితమని సూచించింది. 

ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఐపీఎల్ 2025 ని తమ దేశంలో నిర్వహించాలనే ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచింది. ఇంగ్లండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ ఆడటానికి ఎలాగో ఇంగ్లండ్ వస్తున్నందున.. ఐపీఎల్ కూడా నిర్వహిస్తే ఇండియాకే బెనిఫిట్ అవుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. జూన్ 20 నుంచి టెస్ట్ సీరీస్ ప్రారంభం అవుతుంది. 

పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ప్రయోగిస్తున్న వేళ ఇండియా కూడా ప్రతిస్పందించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో మే 8న పంజాబ్-ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను అర్థంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఐపీఎల్ నిర్వహణకు తమకు ప్రత్యామ్నాయంగా బెంగళూర్, వైజాగ్, చెన్నై తదితర స్టేడియాలు ఉన్నాయని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఈ తరుణంలో తమ దేశంలో నిర్వహించాలని ఇంగ్లండ్ కోరడంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.