
ముంబై: ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మార్చి క్వార్టర్ (క్యూ4) లో నికర లాభం 50 శాతం పెరిగి రూ.4,985 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ రూ.3,311 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్‌బీఐ రేటు కోతల వల్ల నికర వడ్డీ మార్జిన్లు కొద్దిగా తగ్గాయని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.31,058 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.33,254 కోట్లకు పెరిగింది. మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ రాసిన పుస్తకాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మాట్లాడేందుకు మేనేజింగ్ డైరెక్టర్ మణిమేఖలై తిరస్కరించారు.
ఈ విషయంలో సీనియర్ మేనేజ్‌మెంట్ పాత్రపై దర్యాప్తు జరుగుతుందా? అనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు. మార్చి క్వార్టర్లో ప్రధాన నికర వడ్డీ ఆదాయం దాదాపుగా రూ.9,514 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.5,559 కోట్లకు చేరుకుంది.
కేటాయింపులు 16 శాతం తగ్గి రూ.2,715 కోట్లుగా నమోదయ్యాయని, ఫలితంగా లాభం పెరిగిందని మణిమేఖలై తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి 11–-13 శాతం లక్ష్యంతో పోలిస్తే 8.62 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 2.91 శాతంగా ఉంది. ఇది గతంలో విధించుకున్న టార్గెట్ పరిధిలోనే ఉంది. క్యూ4లో నిర్వహణ వ్యయం దాదాపు 20 శాతం పెరిగి రూ.7,373 కోట్లకు చేరుకుంది.