భారతదేశాన్ని గ్లోబల్ హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నిర్ణయాలు ప్రకటించారు. గతంలో విజయవంతమైన సెమీకండక్టర్ మిషన్ 1.0కు కొనసాగింపుగా.. ఈసారి ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ఆమె ప్రారంభించారు. కేవలం విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడమే కాకుండా.. సెమీకండక్టర్ మేధో సంపత్తి(IP), ముడి పదార్థాల తయారీలో భారత్‌ను స్వయంసమృద్ధం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
బడ్జెట్ హైలైట్స్ పరిశీలిస్తే:
* ISM 2.0 ప్రారంభం: చిప్ డిజైన్, మెటీరియల్స్, ఎక్విప్‌మెంట్ తయారీపై ప్రత్యేక దృష్టి.
* ఎలక్ట్రానిక్స్ బూస్ట్: ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ కేటాయింపులను రూ.22వేల 919 కోట్ల నుండి ఏకంగా రూ. 40వేల కోట్లకు పెంచారు.
* సుంకాల రద్దు: టీవీ పరికరాలు, కెమెరాలు, వీడియో గేమ్ తయారీ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని ఏప్రిల్ 1 నుండి రద్దు చేశారు. ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్ రంగానికి పెద్ద ఊరట.
* నైపుణ్యాభివృద్ధి: పరిశ్రమల నేతృత్వంలో రీసెర్చ్, శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా యువ ఇంజనీర్లకు ఉపాధి కల్పన.
నిర్మలమ్మ ప్రకటనలపై టెక్ దిగ్గజాలు సానుకూలంగా స్పందించారు. మౌలిక సదుపాయాలకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం, మైక్రోవేవ్ వంటి గృహోపకరణాలపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుందన్నారు పానాసోనిక్ ఇండియా సీఈఓ తడాషి చిబా. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో కేవలం పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యతనిస్తుందని, ఇది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు టెక్నో ఇండియా సీఈఓ అరిజిత్ తలపాత్ర.
►ALSO READ | రూపాయి ఆదాయంలో.. 20 పైసలు వడ్డీలే కడుతున్న మోడీ సర్కార్
ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సెల్లెకార్ ప్రతినిధులు కూడా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎంఎస్ఎంఈ నిధుల పెంపును స్వాగతించారు. కాంపోనెంట్ సప్లై చైన్ బలోపేతం కావడం వల్ల భారత్ గ్లోబల్ వాల్యూ చైన్‌లో పైకి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ బడ్జెట్ భారతదేశాన్ని చిప్ తయారీ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి గట్టి పునాది వేసిందని నిపుణులు చెబుతున్నారు.
