
- పట్టణాల్లో సర్వీస్‌లు అందిస్తే అదనపు ఛార్జీలు
- ప్రభుత్వానికి ట్రాయ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: స్టార్‌లింక్ వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు తమ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్)లో 4 శాతాన్ని స్పెక్ట్రం ఛార్జీలుగా ప్రభుత్వానికి చెల్లించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం సిఫారసు చేసింది. ఒక శాతం కడతామని ఈ కంపెనీలు కేంద్రం వద్ద లాబీయింగ్ చేశాయి. అంతేకాకుండా పట్టణాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించే కంపెనీలు ఏడాదికి సబ్‌స్క్రైబర్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వానికి అదనంగా చెల్లించాలని ట్రాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు రికమండ్ చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులకు ఈ అదనపు లెవీ వర్తించదు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ కుయిపర్ సిస్టమ్స్ వంటి కంపెనీలు ఇండియాలో ఇంటర్నెట్ సర్వీస్‌లను మొదలు పెట్టాలని చూస్తున్నాయి. స్పెక్ట్రం ఛార్జీని ఏజీఆర్‌లో ఒక శాతం కంటే తక్కువగా ఉంచాలని, అదనపు ఛార్జీలు వేయొద్దని కోరుతున్నాయి. ట్రాయ్ మాత్రం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను ఐదేళ్ల పాటు కేటాయించాలని, మరో రెండేళ్లు పొడిగించేందుకు వీలు కలిపించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
ట్రాయ్ ధరలు ఇలా..
ట్రాయ్ రికమండేషన్స్ ప్రకారం, ఏజీఆర్‌లో 4 శాతం స్పెక్ట్రం ఛార్జీని వేయడం అంటే ఏడాదికి మెగాహెడ్జ్‌పై కనీసం రూ.3,500 వసూలు చేయడం. ‘‘శాట్‌కామ్ సర్వీసులు అందుబాటులోకి వస్తే, టెలికాం నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాలకు కనెక్టివిటీ విస్తరిస్తుంది. విపత్తుల సమయంలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది”అని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోతి అన్నారు. ఏజీఆర్‌లో శాతంగా వసూలు చేసే స్పెక్ట్రం ఛార్జీలు, స్పెక్ట్రం కేటాయింపు కోసం చేసే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని అన్నారు. డాట్ ఈ సిఫారసులను ప్రాసెస్ చేస్తుంది.
వాటిని సవరించొచ్చు లేదా పూర్తిగా ఆమోదించి కేబినెట్ ఆమోదం కోసం పంపొచ్చు. కాగా, స్టార్‌లింక్ తన సర్వీసులను ఇండియాలో ప్రారంభించడానికి ఈ వారం ప్రారంభంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) ను పొందింది. సర్వీసులను ప్రారంభించే ముందు లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ మద్దతు గల యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్ ఇప్పటికే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) సర్వీసుల లైసెన్స్‌ను పొందాయి. స్టార్‌లింక్ కూడా త్వరలో లైసెన్స్ పొందనుంది.