IND vs AUS 1st T20I: వర్షంలో కొట్టుకుపోయిన సూర్య, గిల్ మెరుపులు.. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు

IND vs AUS 1st T20I: వర్షంలో కొట్టుకుపోయిన సూర్య, గిల్ మెరుపులు.. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  బుధవారం (అక్టోబర్ 29) కాన్ బెర్రాలోని మనూక ఓవల్‎ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కు పలుమార్లు వరుణుడు అడ్డు రావడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడలేదు. 6 ఓవర్లో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ కు 18 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత మళ్లీ 10 ఓవర్లో వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించింది. వర్షం ఎంతసేపటికీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టీ20 శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరుగుతుంది. 

అభిషేక్ విఫలం.. సూర్య, గిల్ మెరుపులు:   

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. అభిషేక్ శర్మ ఎప్పటిలాగే బౌండరీలు బాది ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో ఓవర్లో అభిషేక్ రెండు బౌండరీల కొడితే నాలుగో ఓవర్లో గిల్ రెండు ఫోర్లు కొట్టి తన దూకుడును చూపించాడు. పరుగుల ప్రవాహం ఖాయమనుకున్న దశలో అభిషేక్ (19) నాలుగో ఓవర్లో ఎల్లిస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఇండియా 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో గిల్, సూర్య ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఆరంభంలో సూర్య తడబడితే గిల్ వేగంగా ఆడాడు. 

10 ఓవర్లో సూర్య తన విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి మూడు బంతులను వరుసగా 4,4,6 కొట్టి స్కోర్ బోర్డును వేగంగా ముందుకు ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడే సమయానికి ఇండియా 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. మొదట వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. గిల్ (37), సూర్య కుమార్ యాదవ్ (39) అజేయంగా నిలిచారు. అభిషేక్ శర్మ (19) విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్ కు ఒక వికెట్ దక్కింది.