కెనడాలో భారతీయ వ్యాపారవేత్తపై బుల్లెట్ల వర్షం... హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్..

 కెనడాలో భారతీయ వ్యాపారవేత్తపై బుల్లెట్ల వర్షం... హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్..

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా అబోట్స్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన దర్శన్ సింగ్ సాహ్సీ (68) అనే వ్యాపారవేత్తను సోమవారం ఉదయం ఆయన కారులోనే కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో కారులో కూర్చుని ఉన్న దర్శన్ సింగ్ సాహ్సీ ని ఓ దుండగుడు కారు దగ్గరకు వచ్చి అతని పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. కాల్పులు జరిపిన తర్వాత ఆ దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. దర్శన్ సింగ్ సాహ్సీ లూధియానాకు చెందినవాడు కాగా, అయన కానమ్ ఇంటర్నేషనల్ అనే దుస్తుల రీసైక్లింగ్ సంస్థకు అధ్యక్షుడు.

ఇది కావాలనే టార్గెట్ చేసి దాడి చేసారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ముందే అక్కడ కార్ పార్క్ చేసి ఉన్నాడని, దర్శన్ సింగ్ సాహ్సీ బయటకి వచ్చి కారు ఎక్కగానే కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిన వెంటనే జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి సన్నిహితుడైన గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తామే ఈ హత్య చేశామని ప్రకటించాడు.

►ALSO READ | రాఫెల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మా గ్యాంగ్ డిమాండ్ చేసిన దోపిడీ డబ్బు(extortion money) ఇవ్వడానికి దర్శన్ సింగ్ సాహ్సీ నిరాకరించాడని, మా నంబర్‌ కూడా బ్లాక్ చేశాడని ధిల్లాన్ ఆరోపించాడు. దర్శన్ సింగ్ సాహ్సీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాల్గొన్నాడని, డబ్బు  ఇవ్వనందుకే  శిక్షించాం అని పేర్కొన్నాడు. అయితే, పోలీసులు ఈ విషయాన్నీ ఇంకా స్పష్టం చేయలేదు.

 కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, కార్యకలాపాలను అరికట్టడానికి పూర్తి అధికారం ఇచ్చిన  కొద్ది వారాలకే ఈ దారుణం జరిగింది. అబాట్స్‌ఫోర్డ్ పోలీసులు వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తు, ఏమైనా క్రాస్-బోర్డర్ లింక్‌లు ఉన్నాయేమో గుర్తించడానికి ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.