రాఫెల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాఫెల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ యుద్ధ విమానంలో విహరించారు. బుధవారం (అక్టోబర్ 29) అంబాలా వైమానిక దళం స్టేషన్ నుంచి ఆమె రాఫెల్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మరొక విమానంలో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న రాఫెల్ ఫైటర్ జెట్‎కు ఎస్కార్ట్‎గా వెళ్లారు. దాదాపు 30 నుంచి 35 నిమిషాల పాటు రాష్ట్రపతి గగనతలంలో విహరించారు. 

రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాన్ని  గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ నడిపారు. ఆయన భారత వైమానిక దళం 17 స్వ్కాడ్రన్‎లోని గోల్డెన్ యారోస్‎కు కమాండింగ్ ఆఫీసర్. యుద్ధ విమానాల్లో ద్రౌపది ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. 2023లో అస్సాంలోని తేజ్‌పూర్ వైమానిక దళ స్టేషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30MKI ఫైటర్ జెట్‌లో ఆమె ప్రయాణించారు. 

బ్రహ్మపుత్ర నది, తేజ్‌పూర్ లోయ మీదుగా దాదాపు 30 నిమిషాలు గాల్లో విహరించి సురక్షితంగా ఎయిర్ బేస్‎కు తిరిగి వచ్చారు. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు గుండె కాయలాంటిదైన రాఫెల్ ఫైటర్ జెట్ లో ఆమె ప్రయాణించారు. మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్ధుల్ కలాం, ప్రతిభా పాటిల్ కూడా సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో విహరించారు.