SEBI on Mutual Funds: భారతీయ పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్ రంగంలో పెద్ద మార్పుల దిశగా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ SEBI కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తోంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మరింత లాభం చేకూరేలా.. పారదర్శకతను పెంచేలా, ఖర్చులను తగ్గించేలా మార్పులను సూచించింది సెబీ.
ప్రస్తుతం ఉన్న 1996 మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సమీక్షిస్తూ.. సెబీ కొత్త కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది. ఇందులో మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఖర్చు నమూనాల్లో మార్పులు చేయాలని సూచించింది. ముఖ్యంగా బ్రోకరేజ్ అండ్ ట్రాన్సాక్షన్ ఖర్చులపై గరిష్ట పరిమితులను భారీగా తగ్గించాలని ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్‌లో ట్రేడులకు గరిష్ట బ్రోకరేజ్ 12 బేసిస్ పాయింట్ల నుంచి 2 పాయింట్లకు తగ్గించాలని.. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో 5 బేసిస్ పాయింట్ల నుంచి 1 బేసిక్ పాయింట్ వరకు ఖర్చును తగ్గించాలని సెబీ సూచించింది. ఈ మార్పులు నేరుగా పెట్టుబడిదారులకు సేవింగ్స్ రూపంలో ప్రయోజనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
2018 నుంచి అమల్లో ఉన్న అదనపు 5 బేసిస్ పాయింట్స్ మొత్తం ఆస్తుల(AUM) పై వసూలు చేసే ఖర్చును రద్దుచేయాలని కూడా సెబీ ప్రతిపాదించింది. దీనికి బదులుగా యాక్టివ్ ఓపెన్-ఎండెడ్ ఫండ్స్ కోసం ప్రాథమిక ఖర్చు పరిమితిని 5 బేసిస్ పాయింట్ల మేర పెంచనుంది. ఖర్చుల వివరణల్లో పారదర్శకత కోసం.. టాక్సెస్, ప్రభుత్వ ఛార్జీలు (STT, GST, స్టాంప్ డ్యూటీ మొదలైనవి)లను మ్యూచువల్ ఫండ్ ఖర్చులో చూపకుండా వేరుగా ప్రకటించాలని మరో సెబీ సూచించింది. దీంతో టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియోలో ఫండ్ మేనేజ్‌మెంట్ ఖర్చులు మాత్రమే కనిపించనున్నాయి.
ALSO READ : టూరిస్టులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షాక్..
అలాగే పనితీరు ఆధారంగా ఫీజు నిర్ణయించే "పర్ఫార్మెన్స్-లింక్డ్ టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో" పద్ధతిని ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తోంది. ఇందులో ఫండ్ పనితీరు బాగుంటే ఏఎంసీలు కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేయగలవు. పనితీరు తగ్గితే తక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఫండ్ ఆఫర్లు(NFOs) ప్రారంభించేటప్పుడు ఏర్పడే ఖర్చులను ఫండ్ కాకుండా ఏఎంసీ స్వయంగా భరించాలని సెబీ స్పష్టం చేసింది. ఈ చర్య పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కాపాడి.. బాధ్యతను సంస్థలపై ఉంచుతుంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగం మరింత పారదర్శకంగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
