12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు

12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం అనుమతించదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. అయిదు దశబ్దాలపాటు హక్కులపై మౌనంగా ఉండి ఇప్పుడు వివిధ కొత్త కారణాలతో పూర్వీకుల ఆస్తిపై హక్కులను క్లెయిం చేయలేరంటూ హైకోర్టు పేర్కొంది. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సుమారు 29 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన దావాను సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ 22వ సెంచురీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా అండ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 

1967 నాటి నుంచి భూమికి సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ ప్రస్తావించకుండా కేవలం 2020 నాటి లావాదేవీల ఆధారంగా ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. తెలివిగా రూపొందించిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌తో కోర్టుకు వాస్తవాలు వెల్లడించకుండా దావా వేయడాన్ని తప్పుబట్టారు. లిమిటేషన్‌‌‌‌‌‌‌‌ చట్టానికి విరుద్ధంగా 12 ఏండ్లకు పూర్వంనాటి వివాదంపై దావాను అనుమతిస్తూ సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు.