AI సెమీకండక్టర్ల తయారీలోకి హైదరాబాద్ ఐటీ కంపెనీ.. ఇవాళ 20% పెరిగిన స్టాక్..!

AI సెమీకండక్టర్ల తయారీలోకి హైదరాబాద్ ఐటీ కంపెనీ.. ఇవాళ 20% పెరిగిన స్టాక్..!

గడచిన కొంత కాలంగా ఏఐ, సెమీకండక్టర్స్ వంటి రంగాల్లోకి కొత్తగా అనేక కంపెనీలు వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో వీటికి మంచి ఆదాయ, వృద్ధి అవకాశాలు ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులకు వీటిని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న చిన్న ఐటీ కంపెనీ ఏఐ చిప్స్ తయారీలోకి వస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం అమెరికాకు చెందిన సంస్థతో భాగస్వామ్యం కుదిరినట్లు ప్రకటించటంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. 

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ లిమిడెట్ కంపెనీ గురించే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ ఎడ్జ్ ఏఐ సెమీకండక్టర్ల డిజైన్, తయారీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందుకోసం అమెరికాకు చెందిన బైట్ ఎలిప్స్ సంస్థతో రూ.132 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ కంపెనీ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోని కంపెనీల అవసరాల కోసం ప్రత్యేకంగా చిప్స్ తయారీ, డిజైనింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్ట్ 18 నెలల్లో దశలవారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలని కంపెనీ చుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలను అందిస్తోంది. ఏఐ అవసరాల కోసం ఎడ్జి చిప్స్ రూపొందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. దీని వల్ల ఏఐ టాస్క్స్ డేటా సోర్స్ దగ్గరే పూర్తి చేయెుచ్చని.. రిమోట్ సర్వర్లకు డేటా పంపాల్సిన అవసరం ఉండదని కంపెనీ చెబుతోంది. చిప్స్ ఒక సెకనుకు టెరా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం కలిగి రియల్ టైం ఇంటర్ఫేస్ తో పనిచేస్తాయని వెల్లడైంది. దీంతో భారీ డేటాలను లోకల్ గానే ప్రాసెస్ చేయటం కుదురుతుందని బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ చెబుతోంది. 

దూసుకుపోతున్న స్టాక్..

బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ కొత్తగా ఏఐ చిప్స్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించటంతో ఇంట్రాడేలో గరిష్ఠంగా 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో బీఎస్ఈలో స్టాక్ రేటు ఒక్కోటి 19 శాతం లాభంతో రూ.28.40 స్థాయిల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ స్టాక్ 52వారాల గరిష్ఠ ధర రూ.79.95 వద్ద ఉండగా..52 వారాల కనిష్ఠ ధర రూ.14.95 వద్ద ఉన్నాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వాకరణకు మెుగ్గుచూపటంతో షేర్ ధర క్రమంగా తగ్గుతోంది.