ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల ప్రయాణాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ బుధవారం మార్కెట్లలో అదనపు ర్యాలీకి కారణంగా మారాయి. దీంతో ఉదయం 11.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా లాభంతో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా స్వల్ప లాభాలతో ముందుకు సాగుతోంది.
తాజాగా ట్రంప్ భారతదేశంతో ట్రేడ్ డీల్ త్వరలోనే కుదుర్చుకోబోతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు భారత ప్రధాని మోడీ అంటే గౌరవం ఉందని దక్షిణ కొరియాలో మాట్లాడుతూ అన్నారు. అలాగే పాక్ తో యుద్ధ సమయంలో మోడీతో జరిపిన చర్చల గురించి కూడా అక్కడ ప్రస్థావించారు. మోడీ తండ్రిలాంటి స్వభావం కలిగిన మంచి వ్యక్తి అంటూ పొగడ్తలు గుప్పించిన సంగతి తెలిసిందే. చర్చల్లో ఆయనకు మించినోడు లేడని చాలా కఠినమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. అలాగే పాక్ భారత్ ఉద్రిక్తతలు తగ్గించకపోతే, యుద్ధా్న్ని కొనసాగించి ఉంటే రెండు దేశాలు 250 శాతం టారిఫ్స్ చూడాల్సి వచ్చేదని అమెరికా నుంచి అన్నారు ట్రంప్.
ఇప్పటికే 5 రౌండ్లలో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ గురించి చర్చలు కొనసాగిన నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ భారత స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలతో టెక్స్ టైల్, రొయ్యలకు సంబంధించిన షేర్లు ఏకంగా ఇంట్రాడేలో 4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో రొయ్యల వ్యాపారంలోని ఎపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, కోస్టల్ కార్పొరేషన్, అవంతి ఫీడ్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
ఇక టెక్స్ టైల్స్ రంగానికి చెందిన గోకల్ దాస్ ఎక్స్ పోర్ట్స్, పెర్ల్ ఇండస్ట్రీస్, రేమాండ్, కేపీఆర్ మిల్స్ కంపెనీల షేర్లు కూడా ఇంట్రాడేలో 2 నుంచి 4 శాతం మధ్య పెరుగుదలను చూశాయి. ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే సుంకాలు తగ్గి ఈ రెండు రంగాల్లో ఎగుమతులు తిరిగి పుంజుకుంటాయని వ్యాపార వర్గాలతో పాటు మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
