సర్కారు దవాఖానాల్లో డయాలసిస్ పేషెంట్లకు మెరుగైన వైద్యం

సర్కారు దవాఖానాల్లో డయాలసిస్ పేషెంట్లకు మెరుగైన వైద్యం
  • జిల్లాలో ఏడాదిలోనే 23 యూనిట్స్​పెంపు.. 
  • మొత్తం 53కు చేరిన యూనిట్ల సంఖ్య 
  • కలెక్టర్​ చొరవతో కొత్తవి ఏర్పాటు
  • డయాలసిస్​పేషెంట్లకు తప్పిన కష్టాలు.. తగ్గిన ఖర్చులు..

భద్రాద్రికొత్త గూడెం, వెలుగు : డయాలసిస్​రోగులకు రాష్ట్ర  ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్​ సంఖ్య తక్కువగా ఉండడంతో , ప్రైవేట్​లో ట్రీట్​మెంట్​ చేయించుకోలేక డయాలసిస్​ బాధితులు అష్టకష్టాలు పడ్డారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల నుంచి వచ్చిన ప్రపోజల్స్​ను ప్రభుత్వం పరిశీలించింది. ఏడాది కాలంలోనే జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటళ్లకు 23 యూనిట్స్(బెడ్స్​)​ను సాంక్షన్​ చేసింది. జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో మొత్తం యూనిట్స్​ సంఖ్య 53కు చేరింది. 

గవర్నమెంట్​ హాస్పిటళ్లలో 263 పేషెంట్లు.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 370 మందికి పైగా డయాలసిస్​ రోగులున్నారు. జిల్లాలోని పలు గవర్నమెంట్​ హాస్పిటళ్లలో దాదాపు 263 మంది రోగులు ట్రీట్​మెంట్​పొందుతున్నారు. గతంలో సర్కార్​ దవాఖానాల్లో సరిపోను యూనిట్స్​లేక పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన డయాలసిస్​ రోగులు నానా అవస్థలు పడేవారు. అప్పుడు కేవలం కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట హాస్పిటళ్లలో మాత్రమే అరకొర బెడ్స్​తో డయాలసిస్​ సేవలందేవి. సరైన బెడ్స్​ లేక రోగులు రూ. వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్​లో ట్రీట్​మెంట్​ తీసుకునే వారు. ఇక మారుమూల ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి, చర్ల లాంటి ప్రాంతాలకు చెందిన వారు కొత్తగూడెం, భద్రాచలం వచ్చి ట్రీట్​మెంట్​ తీసుకోలేని పరిస్థితి ఉండేది.

ఈ దశలో పలువురు కిడ్నీలు ఫెయిల్​ అయి మృతి చెందేవారు. ఈ క్రమంలో డయాలసిస్​ రోగులు పడ్తున్న బాధలను చూసిన కలెక్టర్​, వైద్యాధికారులు  ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ఏడాది కాలంలోనే జిల్లాలోని పలు హాస్పటళ్లకు డయాలసిస్​ సేవలు విస్తరించాయి. అప్పటగి వరకు 30 యూనిట్స్​ ఉండగా, ఏడాదిలో కొత్తగా 23 యూనిట్స్​ సాంక్షన్​ కావడం, ఖర్చు తగ్గడంతో డయాలసిస్​ పేషెంట్లు కొంత రిలీఫ్​గా ఫీలవుతున్నారు. 

ఖమ్మం వెళ్లే బాధ తప్పింది.. 

రక్త శుద్ధితో పాటు ట్రీట్​మెంట్​ కోసం గతంలో ఖమ్మానికి వెళ్లేవాడిని. వారానికి మూడు సార్లు బస్సులో ఖమ్మానికి నాలుగు గంటలు రాకపోకలు సాగిస్తూ నరకం అనుభవించా. పెరిగిన యూనిట్స్​తో ప్రస్తుతం కొత్తగూడెంలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నా. సౌకర్యాలు బాగున్నాయి.   - వై. నరేశ్, డయాలసిస్​ పేషెంట్​

నాణ్యమైన వైద్య సేవలు 

జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ, చర్ల, ఇల్లెందు, భద్రాచలం హాస్పిటళ్లలోని డయాలసిస్​ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి. ప్రస్తుతం కొత్తగూడెం తప్ప మిగిలిన హాస్పిటళ్లలో ఖాళీలున్నాయి. డయాలసిస్​ రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - బి. కిరణ్​ కుమార్, క్లస్టర్​ ఇన్​చార్జ్​

కలెక్టర్​ చొరవతోనే కొత్తవి.. 

ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్​జితేశ్​ చొరవతోనే జిల్లాకు కొత్తగా 23 యూనిట్స్​ సాంక్షన్​ అయ్యాయి. గతంలో బెడ్స్​ ఎప్పుడు ఖాళీ అవుతాయా అని రోగులు ఎదురు చూసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాలలోనూ ఐదు యూనిట్స్​ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. - డాక్టర్​ రవి కుమార్​, డీసీహెచ్​ఎస్​, భద్రాద్రికొత్తగూడెం

జిల్లాలో డయాలసిస్​ యూనిట్లు, రోగుల వివరాలు.. 

హాస్పిటల్     పాత యూనిట్స్​     పెరిగిన యూనిట్స్​    పేషెంట్స్​
కొత్తగూడెం               05                              05                               64 
పాల్వంచ                00                              10                               40
భద్రాచలం              10                              00                               52
ఇల్లెందు                   05                              03                               31
మణుగూరు              05                              00                               33
చర్ల                            00                              05                               12
అశ్వారావుపేట       05                              00                               31
మొత్తం                     30                              23                              263