రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: చైర్మన్​ సత్యనారాయణ

రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: చైర్మన్​ సత్యనారాయణ

హైదరాబాద్, వెలుగు :  రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని రెరా చైర్మన్​ సత్యనారాయణ హెచ్చరించారు. రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార, మార్కెటింగ్, ప్రీ లాంచింగ్ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టొద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సంబంధిత రియల్​ఎస్టేట్​ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విధిగా రిజిస్టర్ కావాలని, ఆ తర్వాతే మార్కెటింగ్ ప్రకటనలు చేసుకోవాలన్నారు. 

రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులను సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి నోటీసులు జారీ చేయడంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10% వరకు అపరాధ రుసుము విధిస్తున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలు తమ  ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార ప్రకటనలలో (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబరు పేర్కొనాలన్నారు. అథారిటీ వెబ్​సైట్​లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు ప్రీ లాంచింగ్ తో పాటు రెరా నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీ చేసి.. రూ.21 కోట్లు ఫైన్ విధించామని ఆయన తెలిపారు. అన్ని అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోళ్లు చేయాలని, అనుమతులు లేని ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని కొనుగోలుదారులకూ ఆయన సూచించారు.