బ్యాంకుల విలీనంపై ఆందోళన వద్దు

బ్యాంకుల విలీనంపై ఆందోళన వద్దు

హైదరాబాద్: ఈ నెల 15 నుంచి రైతుబంధు పథకం నిధులు విడుదల చేయనుంది సర్కార్. 63లక్షల 25వేల మంది రైతులు అర్హులని తుదిజాబితా విడుదల చేసింది వ్యవసాయ శాఖ. కోటి 50 లక్షల ఎకరాలకు సాయం అందించేందుకు 7వేల 508 కోట్లు అవసరమవుతాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. గత యాసంగి కన్నా 2లక్షల 81వేల రైతులు కొత్తగా అర్హులుగా చేరారని చెప్పారు. మొదటిసారి అర్హులైన రైతులు AEO, AOలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.  

బ్యాంకుల విలీనంతో IFSC కోడ్లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందొద్దన్నారు.  నల్లగొండ జిల్లాలో ఎక్కువగా 4లక్షల 72వేల 983 మంది రైతులు అర్హులుగా ఉన్నారని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అతితక్కువగా 39వేల 762 మంది రైతులు అర్హులుగా ఉన్నారన్నారు. ఏడు జిల్లాలకు చెందిన రైతులకు 3వందల కోట్ల నుంచి 4వందల కోట్ల సాయం అందుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మరో 11 జిల్లాలకు 2వందల నుంయి 3వందల కోట్లు రైతుబంధు కోసం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 10 జిల్లాలకు వంద నుంచి రెండువందల కోట్లు అవసరమవుతాయన్నారు. వరంగల్ అర్బన్, ములుగు, మేడ్చల్ జిల్లాల్లో వంద కోట్లలోపు నిధులతో రైతులకు సాయం అందుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కరోనా విపత్తులోనూ గతేడాది నుంచి వరసగా మూడోసారి రైతులకు రైతుబంధు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.