ప్రాణాలు పోయిన పరిశ్రమలకు భూములు ఇవ్వం

ప్రాణాలు పోయిన పరిశ్రమలకు భూములు ఇవ్వం

రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుతో పేదల భూములను  బలవంతంగా గుంజుకోవడం దారుణమన్నారు. మిర్యాలగూడలోని ఆలగడపలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. భూములు తీసుకుని  ఓట్లేసిన ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని  వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సూచించారు.  

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసంపేదల భూములను బలవంతంగా లాక్కొంటున్న ప్రభుత్వం ఎర్రవల్లి  సీఎం ఫాం హౌస్ భూములు ఇండస్ట్రీయల్ పార్క్ కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు బిఎస్పీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తుందని తెలిపారు. 

మరోవైపు అదే మిర్యాలగూడలో నిరుద్యోగ సంఘీభావ సదస్సుకు హాజరైన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్..రాష్ట్రంలో  ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న  ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 

రాష్ట్రంలో బిఎస్పీ అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెడతామన్నారు ప్రవీణ్ కుమార్. నిరుద్యోగుల ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బహుజన రాజ్యంలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.