ఇంద్రవెల్లి, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పరిధి మురాడి వద్ద మంగళవారం పీఠాధిపతి మెస్రం వెంకటరావు పటేల్ అధ్యక్షతన మెస్రం వంశీయులు సమావేశమయ్యారు. ముందుగా నాగోబా ప్రచార రథానికి పూజలు చేసి, అనంతరం ఊరి పొలిమేర వరకు సాగనంపారు. ఇందులో మెస్రం హనుమంతు కటోడ, మెస్రం దాదిరావు(ప్రధాన్) లు బుధవారం సిరికొండ మండల కేంద్రానికి చేరుకుంటారు.
అక్కడ కుమ్మరి గుగ్గిల లస్మన్న కుటుంబానికి కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. అనంతరం రాజంపేటలో బస చేస్తారని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు పటేల్ తెలిపారు. మరుసటి రోజు 24 సోయంగూడ, 25న గిన్నెర, 26న సాలెవాడ, 27న పొల్లుగూడ, 28న వడగావ్ గ్రామాల్లో ప్రచారం చేసి, 29న తిరిగి కేస్లాపూర్ చేరుకుంటుందని తెలిపారు.30న కేస్లాపూర్ నుంచి గంగా జల సేకరణకు జన్నారం మండలం హస్తల మడుగుకు వెళ్తామని చెప్పారు.
