మళ్లీ వెనక్కి వెళ్లిపోతాం.. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ అధికారుల తీరు

మళ్లీ వెనక్కి వెళ్లిపోతాం..   హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ అధికారుల తీరు
  • జీహెచ్​ఎంసీపై కన్నేసిన కొందరు ఆఫీసర్లు
  • బల్దియా విస్తరణతో హెచ్​ఎండీఏను వీడేందుకు ప్లాన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: జీహెచ్​ఎంసీ పరిధిని విస్తరించడంతో తాజాగా హెచ్​ఎండీఏలో డిప్యూటేషన్​పై కొనసాగుతున్న అధికారుల్లో చాలా మంది.. తిరిగి తమ మాతృసంస్థకు వెళ్లేందుకు ప్లాన్​ చేసుకుంటున్నారు. హెచ్​ఎండీఏలోని ప్లానింగ్​, ఇంజినీరింగ్​ విభాగాల్లో కొందరు అధికారులు జీహెచ్​ఎంసీపై కన్నేశారు. జీహెచ్​ఎంసీ పరిధి ఓఆర్​ఆర్​ వరకూ విస్తరించిన విషయం తెలిసిందే. ఓఆర్​ఆర్​ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేయడంతో ఇప్పుడు చాలా మంది హెచ్​ఎండీఏలోని అధికారులు ఆయా ప్రాంతాల్లో కీలక బాధ్యతల కోసం ఉన్నతస్థాయిలో కొందరు ప్రయత్నిస్తుండగా, మరి కొందరు శాఖాపరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

2006లో హెచ్​ఎండీఏ ఏర్పడిన తర్వాత జీహెచ్​ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ డిపార్ట్​మెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్, ఇతర ముఖ్యమైన అధికారులు చాలా మంది డిప్యుటేషన్​పై హెచ్ఎండీఏలోకి వచ్చారు. ఇప్పటికీ హెచ్​ఎండీఏలో దాదాపు 28 మంది అధికారులు ఇతర శాఖల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇందులో ప్లానింగ్​ డైరెక్టర్ల నుంచి అసిస్టెంట్​ప్లానింగ్​ ఆఫీసర్ల వరకూ వివిధ కేటగిరీలకు చెందిన వారున్నారు. తాజాగా హెచ్​ఎండీఏ పరిధి ఔటర్​ రింగ్​రోడ్​ నుంచి త్రిపుల్ ఆర్​ వరకూ ఏర్పాటు చేశారు. అంటే అంతకు ముందు 7,252 చ.కి.మీ. పరిధిలో ఉన్న హెచ్​ఎండీఏను తాజాగా 10,050 చ.కి.మీ.లకు పెంచారు. అయితే అతి ముఖ్యమైన ఓఆర్​ఆర్​ పరిధిలోని ప్రాంతాలే ఇప్పుడు కొందరు అధికారులకు కాసులు కురిపించే కేంద్రాలుగా ఉన్నాయి.

 ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు జీహెచ్​ఎంసీలో విలీనం కావడంతో చాలా మంది హెచ్​ఎండీఏలోని అధికారులు తిరిగి జీహెచ్​ఎంసీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. జీహెచ్​ఎంసీని విస్తరించడంతో ఇప్పుడు ఆ డిపార్ట్​మెంట్​కు పెద్ద సంఖ్యలో అధికారుల అవసరం ఏర్పడనుంది. కొందరు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

ప్రయత్నాలు ఎందుకంటే...

తాజాగా హెచ్​ఎండీఏలోకి జీహెచ్​ఎంసీ, రెవెన్యూ, డీటీసీపీ నుంచి డిప్యుటేషన్​పై వచ్చిన వారు ఉన్నారు. వీరిలో అధికశాతం ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్​ విభాగాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్​ వరకూ బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్​మెంట్​లు, విల్లాలు, టౌన్​షిప్​లు, లే ఔట్​లకు అనుమతులు, లేఔట్​ల రెగ్యులరైజేషన్​ వంటి  అనుమతులన్నీ హెచ్​ఎండీఏ మంజూరు చేస్తోంది. ఈ విభాగాలన్నీ లాభదాయకమైనవే కావడంతో కొన్ని విభాగాల్లో, ముఖ్యంగా ప్లానింగ్​లో కొందరు అధికారులు భారీగా ఆదాయాన్ని పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్​ఎంసీ పరిధి ఓఆర్​ఆర్​ వరకూ విస్తరించడంతో అనుమతులు ఇచ్చే అధికారం  జీహెచ్​ఎంసీకి బదిలీ కానుంది. 

దీంతో హెచ్​ఎండీఏలో తమకు పనిలేకుండా పోతుందని భావిస్తున్న కొందరు అధికారులు ఇప్పటి నుంచే జీహెచ్​ఎంసీలోకి వెళ్లేందుకు ప్లాన్​చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజకీయంగా పైరవీలకు తెరలేపినట్లు సమాచారం. జీహెచ్​ఎంసీ పరిధి విస్తరించినప్పటికీ నిర్మాణాల అనుమతులిచ్చే అధికారం మాత్రం బదిలీ కాలేదు. ప్రస్తుతం హెచ్​ఎండీఏ వద్దనే అధికారాలు ఉన్నాయి. త్వరలోనే సీఎం సమక్షంలో జరుగనున్న హెచ్​ఎండీఏ ఎగ్జిక్యూటివ్​ కమిటీ సమావేశంలో హెచ్​ఎండీఏ అధికారాలను బదిలీ చేసే విషయం తేలిపోనుంది.