రామచంద్రాపురం, వెలుగు: ఎస్టీపీ ప్లాంట్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒడిశాకు చెందిన సోమిత్ రుయిదాస్ (23), హరీశ్ సింగ్ (22) లు ఏడాది కాలంగా ఆర్ఆర్ ఇంజినీరింగ్ కంపెనీలో ఎస్టీపీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కొల్లూర్ లోని బ్లూసుమ్ హైట్స్ అపార్ట్ మెంట్ లో ఎస్టీపీ ప్లాంట్ క్లీనింగ్ చేసేందుకు వెళ్లారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ట్యాంక్ లోని నీటిని తొలగించిన అనంతరం దానిని శుభ్రం చేసేందుకు దిగారు.
ఎస్టీపీ ట్యాంకులో ఆక్సిజన్ అందక సోమిత్, హరీశ్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లోపలికి దిగిన వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు మరణించారు. ఈ మేరకు మంగళవారం సోమిత్ సోదరుడు అమిత్ రుయిదాస్ ఫిర్యాదు చేయడంతో కొల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
