40 ఏండ్లకు సొంతూరుకు మావోయిస్టు నేత ఆజాద్.. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు

40 ఏండ్లకు సొంతూరుకు మావోయిస్టు నేత ఆజాద్.. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: అజ్క్షాతంలో 40 ఏళ్ల పాటు ఉండి ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్​ ఆజాద్​ అలియాస్ గోపన్న మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. 

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు వచ్చిన సాంబయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ సభ ఏర్పాటు చేసి సాంబయ్యను సన్మానించారు. మొదట ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

గతంలో తనతో పాటు మావోయిస్టు ఉద్యమంలో పని చేసి లొంగిపోయిన భార్య సుజాతతో కలిసి తండ్రి సమ్మయ్యకు పాదాభివందనం చేశారు. తల్లి గతంలోనే చనిపోగా, ఆమె ఫొటోకు నివాళులర్పించారు. గ్రామస్తులు ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

ప్రజలు, కుటుంబ సభ్యులు ప్రజా జీవితంలోకి ఆహ్వానించడంతో తాను లొంగిపోయానన్నారు. త్వరలోనే భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తానని, మిగిలిన జీవితాన్ని సైతం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసమే కేటాయిస్తానని తెలిపారు.