బ్యాంకు లోన్‌‌ ఫ్రాడ్‌‌ కేసులో 111 కోట్ల విలువైన ల్యాండ్ అటాచ్‌‌

బ్యాంకు లోన్‌‌ ఫ్రాడ్‌‌ కేసులో 111 కోట్ల విలువైన ల్యాండ్ అటాచ్‌‌
  • ఎస్‌‌బీఐ నుంచి రూ.88.93 కోట్ల లోన్ తీసుకున్న హ్యాక్​బ్రిడ్జి సంస్థ    వడ్డీతో కలిపి బ్యాంకుకు రూ. 189.04 కోట్లు నష్టం
  • భూమిని జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్‌‌, వెలుగు: బ్యాంకులను మోసం చేసిన కేసులో హ్యాక్‌‌బ్రిడ్జ్ హెవిటిక్ అండ్ ఈసన్ లిమిటెడ్‌‌కు చెందిన రూ.111.57 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌‌ఏ), 2002  నిబంధనల కింద జప్తు చేసినట్టు ఈడీ హైదరాబాద్‌‌ జోనల్‌‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (వీఈఎల్‌‌), విక్టరీ ట్రాన్స్‌‌ఫార్మర్స్ అండ్ స్విచ్‌‌గేర్స్ లిమిటెడ్ (వీటీఎస్‌‌ఎల్‌‌) సంస్థ డైరెక్టర్లు వడ్డినేని మహింద్ర కుమార్,  వడ్డినేని మనోజ్ కుమార్, వడ్డినేని వెంకటప్ప నాయుడు ఎస్‌‌బీఐలో రూ.88.93 కోట్ల లోన్‌‌ తీసుకున్నారు. 

ఇందుకు గాను నకిలీ ఫైనాన్షియల్‌‌ డాక్యుమెంట్లు, ఇన్‌‌ఫ్లేటెడ్ బ్యాలెన్స్ షీట్లు,  తప్పుడు రిసీవబుల్స్‌‌ను సమర్పించి క్రెడిట్ సౌకర్యాలు పొందారు. వ్యాపారం కోసం తీసుకున్న బ్యాంక్‌‌ లోన్‌‌ను ఢిల్లీకి చెందిన నవీన్ ఖత్రీ నిర్వహించే షెల్ కంపెనీలకు దారి మళ్లించి, రీరూట్ చేశారు. దీనివల్ల ఎస్‌‌బీఐకి వడ్డీతో కలిపి మొత్తం రూ.189.04 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంతో ఎస్‌‌బీఐ రూ.77.47 కోట్లు రికవరీ చేసింది. 

హ్యాక్‌‌బ్రిడ్జ్ హెవిటిక్ అండ్ ఈసన్ లిమిటెడ్‌‌కు చెందిన భూమి జప్తు 

మరో  రూ. 111.57 కోట్ల నష్టం రికవరీ కావాల్సి ఉండగా.. ఇందుకు గాను ఎస్‌‌బీఐ స్ట్రెస్డ్ అసెట్ మేనేజ్‌‌మెంట్ బ్రాంచ్, హైదరాబాద్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. నిందితులు కుట్ర పన్ని బ్యాంకును మోసం చేసినట్టు గుర్తించింది. 

అయితే, వీఈఎల్‌‌, వీటీఎస్‌‌ఎల్‌‌కు లేదా నిందితులకు చెందిన ఆస్తులు జప్తు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. మహింద్ర, మనోజ్ కుమార్, వెంకటప్పయ్య నాయుడులు డైరెక్టర్లుగా ఉన్న హ్యాక్‌‌బ్రిడ్జ్ హెవిటిక్ అండ్ ఈసన్ లిమిటెడ్‌‌లో 93.28 శాతం కంట్రోలింగ్ స్టేర్​ను కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో హ్యాక్‌‌బ్రిడ్జ్ హెవిటిక్ అండ్ ఈసన్ లిమిటెడ్‌‌కు చెందిన రూ. 111.57 కోట్ల విలువైన భూమిని తాత్కాలికంగా జప్తు చేశారు.