కోడ్ అమల్లోకి వచ్చింది.. గైడ్ లైన్స్ కఠినంగా ఉన్నాయి

V6 Velugu Posted on Sep 28, 2021

  • ఎన్నికల కోడ్..  కోవిడ్ నిబంధనలు సమర్ధవంతంగా అమలు చేస్తాం
  • అందరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
  • ఎన్నికలయ్యేదాకా హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం కూడా నా పరిధిలోనే ఉంటుంది. 
  • కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ 

కరీంనగర్: హుజురాబాద్ అసెంబ్లీకి ఇవాళ షెడ్యూలు విడుదలైనందున నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ ఎన్నికలకు హుజురాబాద్ రిటర్నింగ్ అధికారిగా అక్కడి ఆర్డీవో  ఉంటారని, హుజురాబాద్ లోనే నామినేషన్లు ఉంటాయని వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. కరోనా గైడ్ లైన్స్ చాలా కఠినంగా ఉన్నాయని, అయినప్పటికీ ఎన్నికల కోడ్..  కోవిడ్ నిబంధనలు సమర్ధవంతంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. అందరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన కోరారు. కమలాపూర్ మండలం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి.. ఎన్నికలయ్యేదాకా హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం కూడా నా పరిధిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ లో పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని వివరించిన ఆయన  అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, అక్టోబర్   8వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 13 వరకు ఉపసంహరణ, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ వివరించారు. 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట సమర్ధవంతగా అమలు చేస్తాం 
కోవిడ్ గైడ్ లైన్స్ చాలా కఠినంగా ఉన్నాయని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సమర్ధవంతంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. సోషల్ డిస్టెన్స్, శానిటేషన్, మాస్కు తప్పనిసరి అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్త్ వర్కర్ ను పెడుతున్నామని, ఎన్నికల పరంగా తీసుకోవాల్సిన అన్ని నిఘా వ్యవస్థలను ఉపయోగించుకుంటామన్నారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం హుజూరాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంది కాబట్టి ఎన్నికలయ్యేదాకా ఈ మండలం కూడా నా పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో కొత్త ఓటర్ జాబితా ప్రకటిస్తామన్నారు. 
ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలి
ఎన్నకల్లో పాల్గొనే సిబ్బంది రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలని.. నేనైనా ఎన్నికల విధుల్లో పాల్గొనాలంటే రెండు డోసుల టీకా వేసుకోవాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లు కూడా రెండు డోసులు వేసుకుని ఉండాలన్నారు.  ఇప్పటి నుంచే ఆయా పార్టీలు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థి కూడా రెండు డోసులు వేసుకుని ఉండాలన్నారు. 
ప్రచారంలో పాల్గొనేవారు రెండు డోసులు వేసుకుని ఉండాలి 
ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారు సైతం రెండు డోసులు వేసుకుని ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. దాదాపు హుజురాబాద్ లో అందరికీ దళితబంధు అందరికీ ఇచ్చామని, ఎక్కడైనా మిగిలి పోయిన వారు ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తే మిగతావారికి ఇస్తామన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తాయని,  ఇంకా ఏమైనా ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఇస్తే అమలు చేస్తామన్నారు. హుజురాబాద్ లో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలన్నా రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.  
ఇండోర్, ఔట్ డోర్, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి: సీపీ సత్యనారాయణ
ఈ రోజు నుంచి కోడ్ ముగిసే వరకు నిష్పక్షపాతంగా, కఠినంగా కోడ్ అమలు చేస్తామని కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఇండోర్, ఔట్ డోర్, రోడ్ షోలాంటి వాటిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు పాటించేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా 100 శాతం అంకిత భావంతో పనిచేస్తామన్నారు. ఇప్పటికే అన్ని రకాల హిస్టరీ, రౌడీషీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని వాళ్ల కదలికపై నిఘా పెడతామన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు కృషి చేస్తామన్నారు.  
క్విక్ రెస్వాన్స్ టీమ్స్ ను లా అండ్ ఆర్డర్ ఇంఛార్జీగా డీసీపీ శ్రీనివాస్  
ఎన్నికలు ప్రశాంతంగా.. సజావుగా జరిగేందుకు క్విక్ రెస్వాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ టీమ్ కు లా అండ్ ఆర్డర్ ఇంఛార్జీగా డీసీపీ శ్రీనివాస్ వ్యవహరిస్తారని సీపీ సత్యనారాయణ తెలిపారు. డబుల్ వాక్సిన్ తీసుకున్న పోలీసు సిబ్బందినే ఎన్నికల విధులకు ఉపయోగిస్తామని, ఈరోజు నుంచే అన్ని రకాల తనిఖీలు ప్రారంబిస్తామన్నారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మద్యం, నగదు రాకుండా పటిష్ట నిఘా పెడతామన్నారు. కమలాపూర్ హనుమకొండ జిల్లాలో ఉన్నప్పటికీ.. అక్కడి జిల్లా యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటామన్నారు. 
 

Tagged Karimnagar, karimnagar CP, , karimnagar cp satyanarayana, karimnagar collector, huzurabad latest updates, huzurabad byelection notification, election code came into force, election code guidelines, karimnagar collector RV Karnan

Latest Videos

Subscribe Now

More News