
అనగనగా ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది. ఆ గుంపులో అన్నింటికన్నా ఎత్తుగా, లావుగా ఉండే ఒక ఏనుగు నాయకుడిగా ఉండేది. అది తన పెద్ద శరీరాన్ని చూసుకుని గర్వపడుతూ ఉండేది. ‘‘అడవిలో నన్ను మించిన వారు లేరు. నా బలంతో ఎంతటివారినైనా ఓడించగలను’’ అని తోటి జంతువులతో పొగరుగా మాట్లాడుతుండేది. అంతేకాదు తన కన్నా చిన్నగా, సన్నగా ఉన్న జంతువులను తొండంతో గట్టిగా కొడుతూ.. ఆనందించేది. కొన్ని జంతువులనైతే వాటి చెవుల దగ్గర ఘీంకరిస్తూ భయపెడుతూ ఏడిపించేది. అందువల్ల ఆ ఏనుగు కనపడితే చాలు.. చిన్న జంతువులన్నీ పారిపోయేవి.
ఇలా ఉండగా ఒకరోజు బక్కచిక్కిన ఒక ఎలుక తన పిల్లలకు ఆహారం వెతుక్కుంటూ తన రంధ్రంలోంచి బయటకు వచ్చింది. అక్కడే ఉన్న ఆ ఏనుగు, ఎలుకను చూసి హేళనగా నవ్వింది. అంతటితో ఊరుకోకుండా ఎలుకతో ‘‘నువ్వు ఉండేదే చిన్నగా.. మళ్లీ ఇంత సన్నగా ఉన్నావేంటి? పెద్ద గాలి వీస్తే ఎగిరి పోయేలా ఉన్నావ్! అంతెందుకు నేను గట్టిగా అరిస్తే నీ గుండె గుభేల్మంటుంది’’ అంటూ హేళన చేసింది. ఆ మాటలకు ఎలుక మొహం చిన్నబుచ్చుకుంది. అయినా చేసేదేం లేక ఏనుగును పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నం అయిపోయింది.
అయితే ఆ దారిలో వేటగాళ్లు ఎప్పుడో పన్నిన వల ఉంది. దానిపై మట్టి పేరుకుపోవడం వల్ల సరిగా గుర్తించలేకుండా ఉంది. ఎలుకను చూసి నవ్వుకుంటూ దారి చూడకుండా నడుస్తోంది ఏనుగు. అలా దారి మధ్యలోకి రాగానే ఆ వలలో ఏనుగు కాళ్ళు చిక్కుకుపోయాయి. ముందుకుపోలేక అయోమయ స్థితిలో గింజుకోసాగింది ఏనుగు. కాసేపటి తర్వాత ఆ ఏనుగుకు వల తాళ్ళు విడిపించుకోలేనని అర్థమై నీరసించి, అక్కడే పడుకుంది. బాధతో మూలుగుతూ.. ‘‘నన్ను ఈ వలలో నుంచి ఎవరైనా రక్షించండి” అని దీనంగా వేడుకుంది.
అప్పుడు ఆహారం తీసుకుని తిరిగి తన నివాసానికి వెళ్తున్న ఎలుక ఏనుగును చూసింది. దాని దగ్గరకు వెళ్లి ‘గజరాజా.. దేవుడు కొన్ని జీవులను లావుగా కొన్ని జీవులను చిన్నగా సృష్టించాడు. అయినప్పటికీ దేవుడు వారికే సాధ్యమైన కొన్ని ప్రత్యేకతలు కూడా ఇచ్చాడు. అందుకు నేనే ఉదాహరణ.. నన్ను చూడు చిన్నగా, సన్నగా ఉన్నా నాకు పదునైన పళ్లు ఉన్నాయి. అవే నా బలం’’ అని తన పళ్లతో ఆ వల తాళ్లు కొరికి ఏనుగును విడిపించింది.
ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఉన్న ఏనుగును చూసి ‘‘నేను బలమైన తాడు కొరికాను. చిన్న రంధ్రంలోకి కూడా దూరగలను. నువ్వు ఆ పనులు చేయలేవుగా? ఎవరి గొప్ప వారిదే.. ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు” అని చెప్పింది. ఏనుగు ఎలుకతో ‘‘నన్ను క్షమించు.. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది.
నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు మిత్రమా..” అని చెప్పింది. ఎలుక ‘సరే మంచిది.. నా పిల్లలు ఆహారం కోసం ఎదురుచూస్తున్నాయి” అంటూ దాని వెంట తెచ్చుకున్న ఆహారం తీసుకుని ఎలుక తన రంధ్రంలోకి దూరిపోయింది. ఏనుగు సంతోషంగా దాని గుంపు దగ్గరకు వెళ్లిపోయింది.
–-కంచనపల్లి రవికాంత్–