రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో.. నలుగురు ఉగ్రవాదుల హతం

రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మే 04న(గురువారం) తెల్లవారుజామున భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులిద్దరు లష్కరే తొయీబాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

షోపియాన్‌ జిల్లాకు చెందిన షకీర్‌ మాజిద్‌ నాజర్‌, హానన్‌ అహ్మద్‌గా గుర్తించామని.. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలోనే వీరిద్దరు  ఉగ్రవాద సంస్థలో చేరినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్‌, పిస్తోల్‌, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

గత 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. ఉత్తర కాశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో మే 03వ తేదీన(బుధవారం) ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. దీంతో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి.