
- గవర్నమెంట్‌కు సింగరేణి సరెండర్ చేయనున్న ల్యాండ్‌పై కబ్జాదారుల కన్ను
- నగరంలోని పలుచోట్ల డ్రెయినేజీలపై వెలిసిన అక్రమ నిర్మాణాలు
- అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరం నడిబొడ్డున కూలీ లైన్లో గల రూ. వందల కోట్ల విలువ చేసే సింగరేణి ల్యాండ్‌పై కబ్జాదారుల కన్ను పడింది. క్రమంగా కొద్దికొద్దీ మొత్తం కాజేసే ప్లాన్ లో ఉన్నారు. తమ ఆధీనంలో ఉన్న దాదాపు రూ.150కోట్లకు పైగా విలువైన పదెకరాల ల్యాండ్ను సింగరేణి త్వరలో గవర్నమెంట్‌కు సరెండర్ చేయనుంది. ఇందుకు సంబంధించి ఫైల్ కూడా రెడీ అయ్యింది. దీంతో కొందరు బడా బాబులు పొలిటికల్ లీడర్ల అండదండలతో కబ్జాకు స్కెచ్ వేస్తున్నారు.
అందరి కన్ను కూలీలైన్భూములపైనే..
కొత్తగూడెం నగరంలోని కూలీలైన్లోని ల్యాండ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ గజం రూ.50వేల నుంచి రూ. లక్ష వరకు ధర పలుకుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గవర్నమెంట్అవసరాల నిమిత్తం కూలీలైన్‌లో దాదాపు రూ. 150కోట్లకు పైగా విలువైన సింగరేణి ల్యాండ్ను యాజమాన్యం ప్రభుత్వానికి సరెండర్ చేయనుంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు బడాబాబులు తమ రాజకీయ పలుకుబడితో ఆ ల్యాండ్ను సరెండర్ చేసేలోపే కొద్దికొద్దీగా ఆక్రమించుకునేందుకు స్కెచ్వేశారు.
ఇదీ పరిస్థితి...
ఓ మాజీ కౌన్సిలర్ కూలీలైన్‌లో ఉన్న సింగరేణి ల్యాండ్‌లో దాదాపు 250 గజాలకు పైగా కబ్జా చేసే క్రమంలో గత గురువారం చదును చేశాడు. గతంలో కూడా ఈ భూమిని అదే మాజీ కౌన్సిలర్ ఆక్రమించుకునేందుకు యత్నిస్తే అధికారులు గుర్తించి ‘ఇది గవర్నమెంట్ల్యాండ్’ అని బోర్డు పెట్టారు. కానీ మళ్లీ ఇప్పుడు ఆ భూమిని ఆక్రమించుకునే పనిలోనే అతడు నిమగ్నమయ్యాడు.
మరో మాజీ కౌన్సిలర్ 400 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడు. ‘ఈ ల్యాండ్ నాదే’ అంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా 76జీవో కింద పట్టాకు దరఖాస్తు చేయడం గమనార్హం. మరి కొందరు ఇప్పటికే మున్సిపాలిటీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్‌కు కూతవేటు దూరంలోనే ఓ వ్యక్తి తనకున్న పొలిటికల్ అండదండలతో ఏకంగా గవర్నమెంట్ స్థలాన్నే ఆక్రమించుకోవడంతో పాటు కమర్షియల్ నిర్మాణాలు చేశాడు.
కొన్ని చోట్ల డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరంతా రోడ్డుపైనే నిల్చిపోయింది. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నగరంలోని రామా టాకీస్ ఏరియాలో ఓ ప్రముఖ డాక్టర్ గవర్నమెంట్ స్థలంలోనే షెడ్ వేశాడు.
నగరంలోన బిజినెస్ ఏరియా అయిన చిన్న బజార్ నుంచి పెద్ద బజార్ వరకు గల్లీలు సగం మేర ఆక్రమణకు గురయ్యాయి.
ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం..
గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకునే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. కూలీలైన్‌లో ఆక్రమణకు గురవుతున్న విషయంపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పంపించి విచారిస్తాం. కార్పొరేషన్‌కు సమీపంలో గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించిన విషయంతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినవారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. వారి నుంచి స్పందన లేదు. మరోసారి నోటీస్ ఇచ్చి, అవసరమైతే కూల్చివేస్తాం. – సుజాత, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్