చెరువులు నిండి నెలలు గడిసె.. చేపపిల్లలు రాకపాయే!

చెరువులు నిండి నెలలు గడిసె.. చేపపిల్లలు రాకపాయే!

ఈ ఏడాది రాష్ట్రంలోని 26 వేలకు పైగా చెరువుల్లో 68 కోట్ల చేప పిల్లలు వదులుతామని సర్కారు ప్రకటించింది. భారీ వర్షాలు పడడంతో జూన్, జూలై నెలల్లోనే చెరువులు నిండాయి. కానీ సెప్టెంబర్​ వస్తున్నా సర్కారు మాత్రం ఇంకా చేప పిల్లలను చెరువుల్లో వదలలేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లు డూప్లికేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ పత్రాలు సమర్పించడంతో చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవుతోంది. చట్టవ్యతిరేక పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తోంది. దీంతో చేపపిల్లల పంపిణీ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. 

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 26,770 చెరువుల్లో 68 కోట్ల చేప పిల్లలు, 275 చెరువుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లాల వారీగా జూన్‌‌‌‌‌‌‌‌ నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ టెండర్లు పిలిచారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు బిడ్లు వేశారు. టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేసిన మత్స్యశాఖ ఆఫీసర్లు రూల్​ప్రకారం 83 బిడ్లను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే తక్కువ ధరకు టెండర్‌‌‌‌‌‌‌‌ వేయడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికే 90 శాతం కాంట్రాక్టులు దక్కాయి. 10 శాతం కంటే ఎక్కువ లెస్‌‌‌‌‌‌‌‌ వేస్తే అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌లో 25 శాతం డబ్బులను బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ కింద చూపించాలని ప్రభుత్వ రూల్స్​ఉన్నాయి. దీంతో జూలై నెలలో బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ పేపర్లు ఇచ్చి కాంట్రాక్టర్లు అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. తీరా ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ పేపర్లను ఆయా జిల్లాల మత్స్యశాఖ ఆఫీసర్లు వెరిఫై చేయగా 11 జిల్లాల్లో రూ.12 కోట్ల విలువ చేసే డూప్లికేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ ఇచ్చినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని పాలకొల్లులో గల ఓ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఈ గ్యారంటీ పేపర్లు ఇచ్చారు. ఆ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ కు ఆఫీసర్లు వెళ్లి ఎంక్వైరీ చేయగా అవన్నీ డూప్లికేట్‌‌‌‌‌‌‌‌ అని తేలింది. దీంతో జిల్లా ఫిషరీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు విషయాన్ని మంత్రి తలసాని దృష్టికి తీసుకువెళ్లడంతో టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ ఆపి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. జూన్‌‌‌‌‌‌‌‌ లేదా జూలైలో చేప పిల్లలను చెరువుల్లో పోస్తే మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నాటికి కిలోకు పైగా బరువు పెరుగుతాయి. అలా కాకుండా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలల్లో పోస్తే బరువు పెరగవు. దీనివల్ల లక్షలాది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ పడుతుంది. కానీ ఆఫీసర్లు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. 

ఆగిపోయిన పంపిణీ

చేప పిల్లల పంపిణీలో ఆంధ్రా కాంట్రాక్టర్ల తీరు వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ పడుతోంది. టెండర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ సజావుగా జరిగితే ఆగస్టు నెలలో చేప పిల్లల పంపిణీ జరగాల్సి ఉంది. కాంట్రాక్టర్లు నకిలీ బ్యాంక్​గ్యారంటీ పేపర్లు ఇవ్వడంతో ప్రాసెస్​ఆలస్యమవుతోంది. నకిలీ బ్యాంక్​గ్యారంటీ ఇచ్చిన కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు చేయించడంతోపాటు బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టి చర్యలు తీసుకోవాలి. కానీ మత్స్యశాఖ హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే ఓ పెద్ద ఉద్యోగి ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం వల్లే ఈ నకిలీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ పత్రాలు జమ చేసినవారిపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు జిల్లా ఫిషరీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది సైతం టెండర్లలో జరిగిన గోల్ మాల్ వల్ల కొన్ని జిల్లాల్లో చేప పిల్లలు పోయలేదు. దీంతో లక్షలాది మంది మత్స్యకారులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలలో చేప పిల్లలు పోస్తే కాంట్రాక్టర్లకు తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు. 

పోయినేడాది పోయలే..

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా చెరువులున్నాయి. గతేడాది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందిన వ్యక్తికి చేప పిల్లల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ దక్కిందని చెరువులలో చేప పిల్లలు పోయనీయకుండా టీఆర్ఎస్​లీడర్లు అడ్డుకున్నారు. మా చెరువులలో చేప పిల్లలు పోయకపోవడంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగింది. ఈసారి కూడా టెండర్లలో గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ జరగడం వల్ల చేప పిల్లల పంపిణీ  లేటవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.    

‒ అయిరబోయిన శంకర్‌‌‌‌‌‌‌‌, మత్స్యకారుడు, శాయంపేట, హనుమకొండ జిల్లా

జీవనోపాధి దెబ్బతింటోంది

జూన్‌‌‌‌‌‌‌‌, జూలై నెలలో చెరువులలో చేప పిల్లలు పోస్తే అవి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నాటికి పెరిగి పెద్దవుతాయి. కొత్త బురద నీరులోనే చేపలు పెరుగుతాయి. అలాంటిది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలల్లో చేప పిల్లలు పోస్తే కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికి ఉపయోగం.  మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. 

‒ బోల్లె  దేవేందర్, ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ముదిరాజ్‌‌‌‌‌‌‌‌ సంఘం ప్రధాన కార్యదర్శి