ఫలక్‌‌నుమాలో చేతబడి చేస్తున్నాడనే డౌట్​తో చంపేశాడు

ఫలక్‌‌నుమాలో చేతబడి చేస్తున్నాడనే డౌట్​తో చంపేశాడు
  • ఫలక్​నుమా మర్డర్​ కేసును ఛేదించిన పోలీసులు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: పాతబస్తీ ఫలక్‌‌నుమాలో గత శుక్రవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ స్నేహ మెహరా సోమవారం ఫలక్​నుమా పీఎస్​లో వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన ఎండీ మజీద్​(26) కుటుంబం, ప్రధాన నిందితుడు షేక్​మహ్మద్​అలీ కుటుంబం 2018లో బండ్లగూడలోని ఇరుగుపొరుగు ఇండ్లలో ఉండేవారు. ఆ టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తర్వాత మజీద్​కుటుంబం ఫలక్‌‌నుమాకు మారింది. కొంతకాలం తర్వాత షేక్ మహ్మద్ అలీ తల్లి చనిపోయింది. అతడి సోదరుడు అనారోగ్యపాలయ్యాడు. మజీద్​కుటుంబ సభ్యులంతా కలిసి చేతబడి చేయించడంతోనే ఇలా జరిగిందని మహ్మద్​అలీ అనుమానించాడు. 

మజీద్​కుటుంబంపై పగ పెంచుకుని అతడిని చంపాలని స్కెచ్​వేశాడు. ఈ నెల 2న మధ్యాహ్నం మహ్మద్ అలీ కుటుంబ సభ్యులైన ఉస్మాన్​అలీ, అక్తర్​అలీతో కలిసి నూర్​ఫంక్షన్​హాల్​సమీపంలోని నైస్​హోటల్​దగ్గర కాపు కాశాడు. మజీద్​అక్కడకు రాగానే కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. మృతుడి సోదరుడు మహమ్మద్ అజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్​మీట్​లో ఇన్‌‌స్పెక్టర్ కె.ఆదిరెడ్డి,  ఏసీపీ జావిద్​ఉన్నారు.