రైతు రుణాలు : 50 వేల లోపు మాఫీ

V6 Velugu Posted on Aug 02, 2021

  • 50 వేల లోపు  రైతు రుణాలు మాఫీ
  • పంద్రాగస్టు నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం
  • వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి కొత్త మెడికల్​ కాలేజీలు ప్రారంభం
  • సూపర్​ స్పెషాలిటీ హాస్పిటళ్లకు త్వరలో శంకుస్థాపన.. టిమ్స్​గా పేరు
  • పటాన్‌చెరుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ మంజూరు
  • కరోనా టెస్టుల పెంపు.. వ్యాక్సినేషన్​ వేగవంతం
  • అనాథల స్థితిగతులపై కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు
  • పత్తి సాగును మరింత పెంచాలని నిర్ణయం

హైదరాబాద్‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీని దశల వారీగా అమలు చేసేందుకే కేబినెట్ మొగ్గుచూపింది. రూ. 50 వేల వరకు ఉన్న క్రాప్‌ లోన్లను ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు మాఫీ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది. ఈ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశమైంది. రైతు రుణమాఫీ, పెన్షన్లు, వ్యవసాయం, కరోనా, దళిత బంధు, ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడటంతోనే రెండేండ్లుగా రూ. 25 వేల వరకు రైతు రుణాలు మాత్రమే మాఫీ చేశామని, దీనిద్వారా 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని కేబినెట్‌లో ప్రకటించారు. రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను పంద్రాగస్టు నుంచి మాఫీ చేయనున్నట్లు తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల వివరాలు తెప్పించాలని హెల్త్‌ సెక్రటరీకి కేబినెట్​ సూచించింది. 

ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు మెడికల్‌‌ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని  కేబినెట్​ ఆదేశించింది. అందుకు అవసరమైన మౌలిక వసతులపై మీటింగ్​లో చర్చించారు. కాలేజీ, హాస్టల్‌‌ బిల్డింగులు, బెడ్లు, ఇతర మౌలిక వసతులు సత్వరమే ఏర్పాటు చేయాలని ఆర్‌‌ అండ్‌‌ బీ అధికారులను ఆదేశించారు. మెడికల్‌‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల అన్వేషణ, సౌకర్యాల రూపకల్పనకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ను ఆదేశించారు. వరంగల్‌‌, చెస్ట్‌‌ హాస్పిటల్‌‌, గడ్డి అన్నారం, అల్వాల్‌‌లో ఏర్పాటు చేయనున్న సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణాలు చేపట్టాలని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేయాలన్నారు. అన్ని సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటళ్లకు తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ (టిమ్స్‌‌)గా నామకరణం చేశారు. అన్ని సూపర్‌‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఒక్కచోటే అందించే ఇంటిగ్రేటెడ్‌‌ కాలేజీలుగా తీర్చిదిద్ది వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం పటాన్‌‌చెరులో కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌‌ నిమ్స్‌‌ను మరింత అభివృద్ధి చేయడానికి అవసరమై ప్రపోజల్స్‌‌ రెడీ చేయాలన్నారు. ఇప్పటికీ మెడికల్‌‌ కాలేజీలు లేని జిల్లాలను గుర్తించి దశలవారీగా ఏర్పాటు చేయాలని కేబినెట్‌‌లో తీర్మానించారు. 
వ్యాక్సినేషన్​ వేగవంతం
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులతో పాటు దేశంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితి, హాస్పిటళ్లలో ఏర్పాట్లు, మౌలిక వసతులపై కేబినెట్​లో చర్చించారు. కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాల వివారాలను హెల్త్‌‌ అధికారులు కేబినెట్‌‌కు వివరించారు. ఆక్సిజన్‌‌, మందులు, బెడ్స్‌‌, వ్యాధి వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌‌ వేగవంతం చేయాలన్నారు. ఆక్సిజన్‌‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేసులు ఎక్కువగా నమోదవున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి తగు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడిలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కేబినెట్​ సూచించింది.  
అనాథల విషయంలో సమగ్ర విధానం
ఎదిగే వయస్సున్న పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే వాళ్లు ఒంటరై మానసిక వేదన పడటంతో పాటు సామాజిక వివక్ష ఎదుర్కొంటారని, సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముందని సీఎం కేసీఆర్​ అన్నారు. వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు వారికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించి అండగా నిలుస్తుందన్నారు. అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు రక్షణ కోసం  చర్యలు చేపట్టామని తెలిపారు. అనాథల విషయంలో సమగ్ర విధానం రూపొందించాలని, మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని అన్నారు. ఖాళీగా ఉన్న, అనువైన ప్రభుత్వ ఆఫీసుల్లో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలపై అవగాహన విధాన రూపకల్పన కోసం మంత్రి సత్యవతి రాథోడ్‌‌ అధ్యక్షతన కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మంత్రులు హరీశ్‌‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌‌గౌడ్‌‌, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, కొప్పుల ఈశ్వర్‌‌, గంగుల కమలాకర్‌‌, ఇంద్రకరణ్‌‌ రెడ్డి, జగదీశ్‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, కేటీఆర్‌‌ను సభ్యులుగా, ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ వినోద్‌‌ కుమార్‌‌ను ఆహ్వానితులుగా నియమించారు. సబ్‌‌ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనాథల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పత్తి సాగు పెంచాలి
రైతులు లాభసాటి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కేబినెట్‌‌ ఆదేశించింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌‌తో పత్తి సాగు ఇంకా పెంచాలని, వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలు గుర్తించి, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయా లని, పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పింది. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోందని పేర్కొంది.  రైతులు వరినాట్లు వేస్తున్నారని, వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలంది. 

Tagged Telangana, cabinet, 50 thousand, Crop loans, , Farmers

Latest Videos

Subscribe Now

More News