నిమజ్జనానికి వెళ్లి తండ్రీకొడుకులు మృతి

నిమజ్జనానికి వెళ్లి తండ్రీకొడుకులు మృతి
  • ఆటో చెరువులో పడడంతో ఘటన 

జీడిమెట్ల, వెలుగు: గణేశ్ నిమజ్జనానికి వెళ్లి తండ్రీకొడుకులు మృతి చెందారు. దుండిగల్​లోని పెద్ద (మోతీ) చెరువు వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుండిగల్​కు చెందిన డొక్కా శ్రీను(35), సోనీ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉండగా, శ్రీను కూరగాయలను హోల్​ సేల్​గా తెచ్చి వారంతపు సంతలో అమ్ముతుంటాడు. తన ట్రాలీ ఆటోలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కిరాయి మాట్లాడుకొని, ఆదివారం రాత్రి దుండిగల్​లోని పెద్ద (మోతీ) చెరువు వద్దకు తన పెద్ద కొడుకు జాన్​ వెస్లీ (7)ను వెంట తీసుకెళ్లాడు. నిమజ్జనం అనంతరం ఆటోను చెరువు కట్టపై రివర్స్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆటో చెరువులో పడిపోయింది. 

ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడం, ఆటో డోర్స్ లాక్​ కావడంతో తండ్రీకొడుకులు నీట మునిగి మృతి చెందారు. ఉదయం వరకూ తండ్రీకొడుకులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ రాళ్లు చెదిరిపోయి ఆటో అందులో పడ్డ ఆనవాళ్లు కనిప్పించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, డీఆర్ఎఫ్ సిబ్బందితో మూడు గంటల పాటు శ్రమించి ఆటోను, ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. చెరువు వద్ద మున్సిపల్​అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిజాంపేట​బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.